రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి..

by Disha Web |
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి..
X

మునగాల: నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు సన్న కారు రైతులు తమకు ఉన్న చిన్నపాటి భూమిలో వరి సాగు చేయగా.. సోకిన రోగానికి పురుగుమందులు కొనేందుకు వెళుతుండగా దట్టమైన పొగ మంచులో కారు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరి రైతులను కబళించి వేసిన సంఘటన ఆదివారం ఉదయం మునగాల మండలం ముకుందాపురం వద్ద చోటుచేసుకుంది. ఎస్సై లోకేష్, స్థానికులు.. తెలిపిన వివరాల ప్రకారం నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ ఘని(38), పటాన్ షరీఫ్(35) అనే ఇద్దరు రైతులు పురుగుమందులు కొనేందుకు ద్విచక్ర వాహనంపై మునగాల మండలం ముకుందాపురం వెళ్తుండగా.. మార్గ మధ్యలో 65 నెంబర్ జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి విజయవాడ వైపు అతివేగంగా వెళుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఘని అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన షరీఫ్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఘనికి భార్య ఇద్దరు కుమార్తెలు, షరీఫ్‌కు ఒక కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు సన్నకారు రైతులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మునగాల మండలం ముకుందాపురం గ్రామం 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్ వద్ద నిత్యం ప్రమాదాలు జరిగి ప్రజలు మృత్యువాత పడుతున్న, గ్రామస్తులు ధర్నాలు చేసిన నేటికీ జిఎంఆర్ సంస్థ వారు పట్టించుకోకపోవడం దారుణం అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.Next Story