విషాదం : తండ్రిని కాపాడబోయి కూతురు మృతి

by Kalyani |   ( Updated:2025-02-16 15:15:33.0  )
విషాదం : తండ్రిని కాపాడబోయి కూతురు మృతి
X

దిశ, మునిపల్లి: ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఓ తండ్రికి తీరని లోటును మిగిల్చింది. తండ్రిని కాపాడబోయిన ఓ కూతురు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన మండల పరిధిలోని అంతారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అంతారం గ్రామంలో ఫిబ్రవరి 11న రాత్రి సమయంలో అంతారం గ్రామానికి చెందిన ఇస్మాయిల్ తన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మలవిసర్జన చేస్తుండగా ఇంటి పక్కన ఉన్న వీరారెడ్డి, విజయ్ రెడ్డిలు ఇస్మాయిల్ తో ఘర్షణకు దిగారు.

ఇస్మాయిల్ గొడవ పడుతున్నట్లు శబ్దాలు రావడంతో ఇస్మాయిల్ చిన్న కూతురు అలియా బేగం మా నాన్నను కొట్టకండి అంటూ దండం పెట్టి బతిమిలాడుతుంటే ఇస్మాయిల్ కూతురును పక్కకు నెట్టేస్తూ రాళ్లతో దాడి చేయడంతో కూతురు అలియా బేగం( 15) కు రాయి బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తండ్రిని కాపాడబోయిన ఇస్మాయిల్ కూతురిని స్థానికుల సహకారంతో సంగారెడ్డి వెల్నెస్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. తన కూతుర్ని రాళ్లతో కొట్టి చంపిన వీరారెడ్డి, విజయ రెడ్డి లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి ఇస్మాయిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని అలియా బేగం మండలంలోని కంకోల్ జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నట్లు సమాచారం.

Next Story