గొర్రెల దాహం తీర్చేందుకు వెళ్లి తండ్రీకుమారుడు, బంధువు మృతి

by Disha Web Desk |
గొర్రెల దాహం తీర్చేందుకు వెళ్లి తండ్రీకుమారుడు, బంధువు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : దిగుడు బావి ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిలో తండ్రీ కొడుకులు సైతం ఉండటం విషాదకరం. పల్నాడు జిల్లా మాచవరంలో గురువారం జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మెర్జంపాడు గ్రామానికి చెందిన ఎనుమల నాగులు (45), ఆయన కుమారుడు నాగార్జున (16), వారి సమీప బంధువు ఎనుమల ఆంజనేయులు (60) కలిసి గ్రామ సమీపంలోని పొలంలో గొర్రెలను మేపుతున్నారు. అయితే ఎండలు తీవ్రంగా ఉండటంతో గొర్రెలకు నీళ్లు తీసుకువచ్చేందుకు దగ్గరలోని దిగుడు బావి వద్దకు వెళ్లారు. అయితే నీళ్లు తోడేందుకు నాగార్జున దిగుడు బావిలో దిగాడు.

అయితే నాచు ఎక్కువగా ఉండటంతో జారిపడిపోయాడు. కొడుకును కాపాడేందుకు నాగులు సైతం బావిలో దిగగా మునిగిపోయాడు. ఇద్దరూ రాకపోవడంతో బంధువు ఆంజనేయులు సైతం బావిలోకి దిగారు. ఒకరి తర్వాత ఒకరు బావిలో మునిగిపోయారు. అయితే బావి నుంచి శబ్ధాలు రావడంతో గ్రామానికి చెందిన పెదలక్ష్మయ్య గమనించాడు. పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు జనాలు వచ్చే వారిని బయటకు తీశారు. అయితే అప్పటికే ముగ్గురూ మృతి చెందారు. మృతుల్లో నాగులు కుమారుడు నాగార్జున స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో తండ్రితోపాటు గొర్రెలు మేపేందుకు వెళ్లి ఇలా మృతి చెందాడు. దీంతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మాచవరం ఎస్‌ఐ కోటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed