మధిర ప్రజలను హడలెత్తిస్తున్న దొంగ అరెస్ట్

by Sridhar Babu |
మధిర ప్రజలను హడలెత్తిస్తున్న దొంగ అరెస్ట్
X

దిశ, మధిర : వరుస దొంగతనాలతో మధిర ప్రజలను హడలెత్తిస్తున్న దొంగను ఎట్టకేలకు మధిర పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మధిర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైరా ఏసీపీ రెహమాన్ వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన బండి గోపి కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన గోపి ఆన్లైన్ బెట్టింగులు ఇతర ఆర్థిక అవసరాల నిమిత్తం దొంగతనాలకు పాల్పడ్డాడు. మధిర పట్టణంతోపాటు గంపలగూడెం, వత్సవాయి తదితర ప్రాంతాల్లో చోరీలు చేశాడు. ఇటీవల మధిర మున్సిపాలిటీలోని శ్రీ రామ్ నగర్ లో షిఫ్ట్ డిజైర్ కారులో దొంగతనానికి ప్రయత్నించి సీసీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో పాటు మడుపల్లి గ్రామంలో లక్కిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఇంట్లో జరిగిన చోరీ పై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. పట్టణ ఎస్సై ఎన్. సంధ్య, అదనపు ఎస్సై ఎన్.చంద్రశేఖర్ బృందం వరుస దొంగతనాలపై దృష్టి సారించారు.

పాత నేరస్తులపై నిఘా పెట్టి ప్రధాన కూడళ్లలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా శుక్రవారం ఉదయం మండల పరిధిలోని ఆత్కూరు క్రాస్ రోడ్డు వద్ద నిందితుడు దొంగిలించిన చోరీ సొత్తును ఖమ్మంలో అమ్మేందుకు కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు ఆపి పరిశీలించగా గోపి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పాటు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దాంతో కారుతో సహా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా 150 గ్రా. బంగారం, 200 గ్రాముల వెండి, 1,50,000 నగదు, ఎలక్ట్రికల్ వస్తువులైన సీసీ కెమెరాలు రెండు, సీసీటీవీ డీవీడీ డ్రైవ్ ఒకటి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు. మధిర పట్టణంలో లడక్ బజార్ సుందరయ్య నగర్, గంపలగూడెం, వత్సవాయి ప్రాంతాల్లో తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన సొత్తును రికవరీ చేసిన పట్టణ ఎస్సై ఎన్.సంధ్య , అదనపు ఎస్సై ఎన్.చంద్రశేఖర్, ఏఎస్ఐ లచ్చు, కానిస్టేబుల్ ఏ.సుమన్, బి.జనార్దన్, జి.సైదులు, డి.కృష్ణయ్య, పి.మురళి, హోంగార్డు షేక్ రవిలను ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు అభినందించి నగదు రివార్డులను అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed