భార్యను హతమార్చిన భర్త..

by Kalyani |
భార్యను హతమార్చిన భర్త..
X

దిశ, లింగాల: కట్టుకున్న భర్త క్షణికావేశంలో భార్యని కొట్టి హతమార్చిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారారం గ్రామానికి చెందిన పర్వతాలు పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన ఏదుల లక్ష్మీ(35)ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ఒకరిని తీసుకొని 15 ఏళ్ల క్రితం లక్ష్మీ భర్తను వదిలి వెళ్ళింది. కాగా 13 ఏళ్ల క్రితం పర్వతాలు లింగోటం గ్రామానికి చెందిన కృష్ణవేణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. రెండో భార్యతో కలిసి ధారారం గ్రామంలో కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో పర్వతాలు గత 3 నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళుతున్నానని చెప్పి వదిలేసిన మొదటి భార్య లక్ష్మీ వద్దకు వెళ్లి ఇద్దరూ వికారాబాద్ జిల్లా తాండూరులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ధారారం గ్రామంలో బొడ్రాయి పునః ప్రతిష్ట ఉత్సవాలలో భాగంగా మంగళవారం బోనాల పండుగలో పాల్గొనటానికి తాండూరు నుంచి లక్ష్మీ, పర్వతాలు సోమవారం సాయంత్రం లింగాలకు వచ్చారు. కొడుకు చేత బైక్ తెప్పించుకున్న పర్వతాలు లక్ష్మిని తీసుకొని అంబటి పల్లి లోని బంధువుల ఇంటికి వెళ్ళారు.

సోమవారం రాత్రి ఆమెను తీసుకొని యాపట్ల మార్గాన దారారంకు వస్తూ మార్గమధ్యంలో వడ్డెరాయవరం సమీపంలోని నల్లకుంట బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో క్షణికావేశంలో ఆమెను పర్వతాలు కొట్టడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మంగళవారం సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతురాలి అక్క ఏదుల జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అనుదీప్ పర్యవేక్షణలో ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story

Most Viewed