ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం

by Disha Web Desk 12 |
ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం
X

దిశ, చేగుంట: ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనమైన సంఘటన మండల పరిధిలోని చిన్న శివునూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చిన్న శివునూరు గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముండే పిట్టల అంజమ్మ (56) తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటుంది. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి సొంత ఇంట్లో ఉంటూ తిరిగి వెళ్ళిపోతుండేది. మంగళవారం రోజు హైదరాబాదు నుండి చిన్న కుమారుడు రాజ్ కుమార్తె మధు (6) తో కలిసి వచ్చింది. సాయంత్రం భోజనాలు చేసి నిద్ర పోయారు.

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సిలిండర్ పేలి పోవడం తో ఇద్దరు.. సజీవ దహనమయ్యారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కొవ్వొత్తి వెలిగించి నిద్రపోయారు. సిలిండర్ లీకేజీ వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగి మంటలు వ్యాపించిన సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అశోక్, ఉపసర్పంచ్ స్వామి, కారోబార్ చంద్రం అగ్నిమాపక సిబ్బందికి, స్థానిక ఎస్సై ప్రకాష్ గౌడ్ కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే సమయానికి అంజమ్మ, మధు మాంసం ముద్దలుగా మారిపోయారు. గ్యాస్ సిలిండర్ పేలగా ఇద్దరు సజీవ దహనం అవడంతో గ్రామంలో విషాద ఛాయాలు చోటుచేసుకున్నాయి.

Next Story