​సారపాకలో రోడ్డు ప్రమాదం.. కుమారుడు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు

by Taduka Kalyani |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

​సారపాకలో రోడ్డు ప్రమాదం.. కుమారుడు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు
X

దిశ,బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక శుభకార్యానికి హాజరై సంతోషంగా తిరిగి వస్తున్న తండ్రీకొడుకులను మట్టి చదును చేసే డోజర్(బుల్) వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 16 ఏళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోగా,తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ​స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చలికాని ప్రవీణ్ (43), ఆయన కుమారుడు చలికాని గణేష్ (16) కలిసి సారపాక చందు బజార్ లోని ఒక ఫంక్షన్ హాల్‌లో జరిగిన విందుకు హాజరయ్యారు. విందు ముగించుకుని వారు తమ మోటార్ సైకిల్ (నెంబర్: టీఎస్ 28 ఎం 5873) పై చందు బజార్ లోని ప్రగతి స్కూల్ మెయిన్ రోడ్డు మీదికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.​ ఇరవెండి రోడ్డు వైపు నుండి సారపాక వైపు వస్తున్న ఒక మట్టి చదును చేసే డోజర్ (బుల్)వాహనం వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

​కుమారుడి మృతి.. తండ్రి పరిస్థితి విషమం...

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన చలికాని గణేష్ (16)ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడు. ​తండ్రి చలికాని ప్రవీణ్ (43) మొహం, శరీర భాగాలపై తీవ్రమైన రక్త గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనను భద్రాచలం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బూర్గంపాడు ​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన డోజర్ వాహనాన్ని, దెబ్బతిన్న బైక్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది? డోజర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ​ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ప్రమాదానికి గురి కావడం, కళ్ల ముందే ఎదుగుతున్న కొడుకు మృత్యువాత పడటంతో బాధితుల కుటుంబంలో కన్నీరు మున్నీరవుతోంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story