వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి.. పిండానికి తల లేదని చెప్పిన వైద్యం..!

by Disha Web Desk 19 |
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి.. పిండానికి తల లేదని చెప్పిన వైద్యం..!
X

దిశ, లింగాల: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన గురువారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం సూరాపురం గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణీ అయిన తన భార్యకు అచ్చంపేట, నాగర్ కర్నూల్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించగా.. గర్భంలో పిండానికి తల లేదని ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించాని.. దానికి రూ. 15 వేలు ఖర్చు అవుతుందని వైద్యలు చెప్పినట్లు తెలిపాడు. అయితే, అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో లింగాలలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్వచ్చంద సంస్థను సంప్రదించామని.. వారు 1500 రూపాయలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లోని బత్తులపల్లి ఆర్డీటి ఆసుపత్రికి పంపించినట్లు వెల్లడించారు.

ఆదివారం బత్తులపల్లి ఆసుపత్రికి వెళ్ళగా.. బుధవారం ఆసుపత్రిలో తన భార్యను అడ్మిట్ చేసుకుని వైద్య సేవలను అందించారని పేర్కొన్నాడు. మొదట నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు.. చివరకు వైద్యం అందిస్తున్న సమయంలో మృతి చెందిందని చెప్పారని వాపోయాడు. అయితే, నాగర్ కర్నూల్ ప్రైవేట్ ఆస్పత్రిలో చూయించినప్పుడు పిండానికి తల లేదని వైద్యులు చెప్పగా.. ఆర్డీటి ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి వైద్యులు చికిత్స అందించడం పలు అనుమానాలకు కలిగిస్తుందని ఆరోపిస్తూ బాధితులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

దీంతో సంఘటన స్థలానికి ఎస్సై రవి చేరుకొని పరిస్థితిని అదులోకి తీసుకువచ్చారు. ఆర్డీటి ప్రతినిధులు బాధితులతో మాట్లాడి మృతురాలి కుమారుడిని చదివిస్తామని, సంస్థ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా 25 వేల రూపాయలను అందించారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed