కాటేస్తున్న కల్తీ కల్లు.. మత్తులో జోగుతున్న ఎక్సైజ్ శాఖ

by Hamsa |
కాటేస్తున్న కల్తీ కల్లు.. మత్తులో జోగుతున్న ఎక్సైజ్ శాఖ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కల్తీ కల్లు జనాన్ని కాటేస్తోంది. ఖరీదైన విస్కీ, బ్రాందీలు కొనలేని పేదలను క్రమంగా కుంగదీస్తూ కాటికి పంపుతోంది. తరచూ ఇలాంటి విషాదాలు వెలుగు చూస్తున్నా ప్రభుత్వానికి, ఎక్సయిజ్ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదు. పైగా, చావులకు కల్తీ కల్లు కారణం కాదంటూ ప్రకటనలు చేస్తున్నారు. కల్తీ కల్లు మాఫియా వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నందునే ఇలాంటి దారుణాలు వెలుగులోకి రావడం లేదని తెలుస్తోంది. ఈ దందాలో ప్రతీయేటా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్టు బలమైన ఆరోపణలున్నాయి. అందుకే ఎక్సయిజ్​అధికారులు సైతం చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయడం లేదని ఆ శాఖ సిబ్బందే చెప్పుకుంటున్నారు.

కొత్త ఎక్సయిజ్ పాలసీతోనే కష్టాలు..

అధికార వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 8 వేలకు పైగా కల్లు డిపోలు నడుస్తున్నాయి. వీటిలో సగానికి పైగా కల్లు కంపౌండ్లలో కల్తీ కల్లు అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్​తో పాటు పలు పట్టణాల్లోనూ కల్తీ కల్లు అమ్మకాలు జోరుగా కొనసాగడం విశేషం. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సయిజ్ పాలసీనే ప్రధాన కారణం. ఏదైనా ప్రాంతానికి 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈత, తాటి చెట్లు లేకుంటే ఆ ప్రాంతంలో కల్లు కంపౌండ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర విభజనకు ముందు అనుమతి లేదు. అందుకే హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లోని కల్లు డిపోలను అప్పట్లో అధికారులు మూసివేయించారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సయిజ్ పాలసీలో భాగంగా చీప్ లిక్కర్ ను ప్రవేశ పెట్టేందుకు ప్లాన్ చేసింది. ఖజానా నింపుకునేందుకు చీప్ లిక్కర్ అమ్ముతారా..? అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శించడంతో ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. కానీ.. 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈత, తాటి చెట్లు లేని ప్రాంతాల్లో కల్లు డిపోలను ఏర్పాటు చేయొద్దన్న నిబంధనను తొలగించింది. దీన్ని అప్పట్లో ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ తీవ్రంగా వ్యతిరేకించినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఇబ్బడి ముబ్బడిగా కల్లు కాంపౌండ్ లు వెలిశాయి.

ప్రమాదకర రసాయనాలు..

రాష్ట్రంలోని పలు పట్టణాల్లో వెలిసిన కల్లు డిపోలతో డిమాండ్ రెండింతలైందని ఎక్సయిజ్ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో 2 కోట్లకు పైగా ఈత, తాటి మొక్కలు నాటేందుకు సీఎం కేసీఆర్ వేసిన ప్లాన్ కార్యరూపం దాల్చలేదు. డిమాండ్ ఎక్కువ, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో కల్లు డిపోల నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి కల్తీ కల్లు అమ్మకాన్ని ప్రారంభించారు. 100 లీటర్ల ఒరిజినల్ కల్లులో మెగ్నీషియం, అల్యూమినియం సల్ఫైడ్ వంటి రసాయనాలు కలిపి 500 లీటర్ల కల్లుగా మారుస్తున్నారు. మత్తు కోసం క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫాజోలెం, డైజోఫాం వంటి ప్రమాదకరమైన రసాయనాలు సైతం వాడుతున్నారు. మద్యం సేవించే అలవాటున్న వారు సైతం ఈ రసాయనాలు కలిపిన కల్లు ఒక్క సీసా తాగితే ఔట్ అవడం ఖాయమని ఓ అధికారి తెలిపారు. ఈ కల్తీ కల్లుకు ఒకసారి అలవాటైతే దాన్ని వదిలించుకోవడం కష్టమని చెబుతున్నారు. కొవిడ్ కారణంగా కల్లు డిపోలు మూతబడటంతో కల్తీ కల్లు దొరకని పరిస్థితిలో వందల మంది పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించడాన్ని ఆయన గుర్తు చేశారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటే, మరికొందరు ఉన్మాదుల్లా ప్రవర్తించారని చెప్పారు. అలాంటి వారిని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు వివిధ హాస్పిటళ్లలో మంచాలకు ఇనుప గొలుసులతో కట్టేసి చికిత్స చేయించిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఇంత జరిగినా..

ఇంత జరిగినా కల్తీ కల్లుకు అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వం కనీస ప్రయత్నం కూడా చేయలేదు. మహబూబ్ నగర్ లో విషాదం దాని ఫలితమే అని విమర్శలొస్తున్నాయి. జడ్చర్ల, నవాబ్​పేట, వనపర్తి తదితర ప్రాంతాల్లో 40 మందికి పైగా కల్తీ కల్లు తాగి ఆస్పత్రుల పాలయ్యారు. అందులో ముగ్గురు మరణించారు. బాధితుల్లో ఎక్కువగా నిరుపేదలే ఉన్నారు. ఇంత ఘోరం జరిగినా.. వారి మరణాలకు కల్తీ కల్లు ఒక్కటే కారణం కాదని, వేర్వేరు ఆరోగ్య కారణాలతో చనిపోయారని ప్రభుత్వ పెద్దలు అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కల్లు డిపోల నుంచి ఎక్సయిజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తరచూ శాంపిళ్లు సేకరించి, హైదరాబాద్ లోని పరీక్షా కేంద్రానికి పంపించి తనిఖీలు చేయాలి. కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే నిందితులపై చర్యలు తీసుకోవాలి. కానీ.. ఏడాదిలో ఒక్క కల్లు డిపోపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎక్సయిజ్ శాఖ పని తీరుకు అద్దం పడుతోంది. దీనికి కారణమేంటని అధికారులను అడిగితే కల్లు డిపోల సిండికేట్ చాలా బలమైనదని చెప్పారు. ఈ సిండికేట్ కు రాజకీయ నాయకుల అండదండలున్నాయని, శాంపిళ్లు సేకరించేందుకు వెళ్తే నిమిషాల వ్యవధిలోనే రాజకీయ పెద్దల నుంచి ఫోన్ కాల్స్ వస్తాయని వాపోయారు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటం కూడా కల్తీ కల్లు దందాకు కారణమన్న విమర్శలున్నాయి. నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కల్తీ కల్లు దందాకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో అని ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.

Next Story