Odisha: ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి భార్యకు మత్తుమందు ఇచ్చి దారుణం

by Y.Nagarani |
Odisha: ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి భార్యకు మత్తుమందు ఇచ్చి దారుణం
X

దిశ, వెబ్ డెస్క్: తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి భార్యను హతమార్చాడో భర్త. మొదట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని నమ్మించాడు. పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం తెలిశాక.. పోలీసులు అతడిని, ఇద్దరు ప్రియురాళ్లను కటకటాల వెనక్కి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు చెందిన ప్రద్యుమ్న కుమార్ (24) కు 2020లో శుభశ్రీ అనే యువతితో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేశాక వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకు భార్యను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని సైకో టార్చర్ ను భరించలేక శుభశ్రీ పుట్టింటికి వెళ్లి.. ఆర్నెల్లుగా అక్కడే ఉంటోంది.

భార్యపుట్టింటికి వెళ్లడానికి ముందే ఇజిత భూయాన్ అనే నర్సుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత రోజీ అనే మరో నర్సుతోనూ స్నేహం పెంచుకున్నాడు. సన్నిహితంగా ఉండే ఈ ముగ్గురూ.. శుభను చంపాలని కుట్రపన్నారు. ప్లాన్ లో భాగంగా అక్టోబర్ 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రద్యుమ్న తన భార్యను సాంపుర్లోని రోజీ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు అధిక మోతాదులో అనస్థీషియా ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 28న ఆస్పత్రికి తరలించారు. తన భార్య ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడు. అప్పటికే ఆమె మరణించిందన్న వైద్యులు.. పోస్టుమార్టం నిర్వహించారు.

ఆమెకు అధిక మోతాదులో మత్తుమందివ్వడం వల్లే మరణించినట్లు తేలిందని మెడికల్ ఆఫీసర్ వెల్లడించారని డీసీపీ తెలిపారు. ప్రద్యుమ్నకుమార్ ను అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో ఇద్దరు నర్సుల పాత్రపై విచారణ చేసి.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed