గోడపైన మూత్రం పోశాడని వెంటాడి చంపారు..

by Dishafeatures2 |
గోడపైన మూత్రం పోశాడని వెంటాడి చంపారు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇచట మూత్రం పోయరాదు.. ఇది చాలా గోడలపైన ఉంటుంది. పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా అక్కడ మూత్రవిసర్జన చేయకూడదని మున్సిపాలిటీ వారు రాస్తారు. కానీ చాలా మంది ఆ రాతలను బేఖాతరు చేసి అక్కడే పని కానిచ్చేస్తుంటారు. అదే విధంగా గోడపై మూత్ర విసర్జన చేసిన కారణంగా ఢిల్లీలో 25 ఏళ్ల యువకుడిని నలుగురు వెంటాడి వెంటాడి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో గురువారం చోటు చేసుకుంది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు మయాంక్ మ్యానేజ్‌మెంట్ స్టూడెంట్ అని తెలిపారు.

అయితే అతడు గోడపై మూత్ర విసర్జన చేసి విషయంలో నిందితుల్లో ఒకడైన మనీష్ తల్లితో మయాంక్ వాగ్వాదానికి దిగాడు. వెంటనే మనీష్ అక్కడికి రావడంతో మయాంక్‌కు అతడికి మధ్య గొడవ మరింత పెరిగింది. దాంతో మనీష్ తన స్నేహితులను పిలిచాడు. వారు నలుగురు రావడంతో మయాంక్ అక్కడి నుంచి పారిపోయాడు. కానీ నిందితులు మయాంక్‌ను వెంటాడి సౌత్ ఢిల్లీ మాల్వియా నగర్ సమీపంలోని డీడీఐ మార్కెట్ వద్ద పట్టుకుని నడిరోడ్డు మీద కత్తితో పొడిచి హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. అయితే సీసీటీవీ కెమెరా రికార్డింగ్ ద్వారా నిందుతులు మనీష్, రాహుల్, ఆశిష్, సురాజ్‌లుగా గుర్తించారు. అయితే విచారణ చేస్తున్న సమయంలో నిందితులు హత్యకు అసలు కారణం తెలిపారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా రికార్డింగ్ ప్రస్తుతం నెట్టింగ తెగ వైరల్ అవుతోంది.


Next Story