స్మార్ట్​ ఫోన్​ ఉంది కదా అని క్లిక్​ చేస్తే గోవిందా..గోవిందా

by Dishafeatures2 |
స్మార్ట్​ ఫోన్​ ఉంది కదా అని క్లిక్​ చేస్తే గోవిందా..గోవిందా
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: చేతిలో స్మార్ట్ ఫోన్​ ఉంది కదా అని వచ్చిన లింకులపై క్లిక్ చేశారో.. మీరు నిలువునా మునగటం ఖాయం. పరిచయం లేని యువతుల నుంచి వచ్చే వాట్సాప్ కాల్​మాట్లాడారా..మనీ పోగొట్టుకోవటం అంతకన్నా ఖాయం. ఒకవైపు సైబర్​నేరాలకు కళ్లెం వేయటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే మరోవైపు రెచ్చిపోతున్న సైబర్​నేరగాళ్లు కోట్లకు కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. రూపాయికి రూపాయి లాభం అంటూ ఆశ అనే వల విసురుతూ అమాయకులను దోచుకుంటున్నారు. మరోవైపు యువతులు న్యూడ్ కాల్స్ చేస్తూ తమ ఉచ్ఛుకు చిక్కుకున్న వారి నుంచి లక్షలకు లక్షలు లాగుతున్నారు. గడిచిన నెలరోజుల్లోనే సైబర్​నేరగాళ్లు ఈ విధంగా రాష్ర్టం మొత్తం మీద పది కోట్ల రూపాయలకు పైగా మోసాలు చేయటం నెలకొని ఉన్న పరిస్థితికి దర్పణం పడుతుంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే బాధితుల్లో కొందరు పోలీసులు సైతం ఉండటం.

ఫిష్​ యాప్

సైబర్​నేరగాళ్లు ఇటీవల నల్గొండ జిల్లాలో వినూత్న రీతిలో వేలాదిమందికి కుచ్చుటోపీ పెట్టారు. ఫిష్​యాప్ ను క్రియేట్​చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా దేవరకొండలో ఉంటున్న వేలాది మందికి లింక్ పంపించారు. లింక్​ ఓపెన్​చేయగానే ఫోన్​స్ స్క్రీన్ పై వేర్వేరు రకాల చేపల బొమ్మలు ప్రత్యక్షమయ్యేలా యాప్​ ను రూపొందించారు. ఆయా చేపల కింద ఉన్న మొత్తాన్ని పెట్టుబడి పెడితే అరవై రోజుల్లో అది మూడింతలవుతుందని జనానికి ఆశ పెట్టారు. తొమ్మిది వందల రూపాయల నుంచి పెట్టుబడులు పెట్టవచ్చని చెప్పటంతో వందల సంఖ్యలో జనం సైబర్​ నేరగాళ్ల ఉచ్ఛులో చిక్కారు. మొదట కొందరికి సైబర్​ నేరగాళ్లు పెట్టిన పెట్టుబడికి మూడింతలు ఇవ్వటంతో జనానికి దానిపై నమ్మకం కుదిరింది. అదే సమయంలో యాప్ నిర్వాహకులు గ్రూప్​లో జాయిన్​ అయిన వారు రెండు వందల ముప్పయి మందిని సభ్యులుగా చేర్పిస్తే నెలకు ఇరవై వేల రూపాయల జీతం ఇస్తామని చెప్పటంలో చాలా మంది ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించుకోవచ్చని బంధుమిత్రులను పెద్ద సంఖ్యలో గ్రూప్​ లో చేర్పించారు.

పెట్టిన పెట్టుబడికి మూడింతలు డబ్బు పంపిస్తున్నారని ఆధారాలు చూపించటంతో చాలా మంది పదివేల నుంచి యాభైవేల రూపాయల వరకు డబ్బు కట్టి యాప్​ లో సభ్యత్వం తీసుకున్నారు. కొందరైతే ఏకంగా వడ్డీకి డబ్బు తెచ్చి మరీ స్కీంలో జాయినయ్యారు. వీరిలో పోలీసు శాఖకు చెందిన వారు కూడా ఉండటం గమనార్హం. ఇలా దేవరకొండతోపాటు జిల్లా వ్యాప్తంగా పదివేల మందికి పైగా జనాన్ని స్కీంలో జాయిన్ చేయించుకుని పది కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన తరువాత సైబర్​నేరగాళ్లు యాప్​ ను డిలీట్ చేశారు. అప్పుడుగాని మోసపోయామని బాధితులు గ్రహించలేదు.

వాట్సాప్ కాల్స్ తో జాగ్రత్త

పరిచయం లేని యువతులు వాట్సాప్ వీడియో కాల్స్​చేస్తూ తమ గాలానికి చిక్కిన వారిని నిలువునా దోచుకుంటున్నారు. దీనికి నిదర్శనంగా ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వృద్ధులను ఇలాగే మోసం చేసి పదిహేను లక్షల రూపాయలకు పైగా కొల్లగొట్టిన ఉదంతాన్ని పేర్కొనవచ్చు. 84 ఏళ్లకు పైగా వయసున్న ఓ వృద్దునికి ఇటీవల ఓ యువతి నుంచి వాట్సాప్ కాల్​వచ్చింది. దానిని లిఫ్ట్​చేయగానే ఓ యువతి ముఖం కనిపించకుండా న్యూడ్​గా స్క్రీన్​పై ప్రత్యక్షమయ్యింది. వృద్ధున్ని కూడా దుస్తులు విప్పేసి మాట్లాడమని రెచ్చగొట్టింది. దాంతో అతను ఫోన్​కాల్​కట్​చేసేశాడు. రెండోసారి యువతి ఫోన్​చేసి మళ్లీ అదే మాట చెప్పగా ఈసారి కూడా కాల్​కట్​చేశాడు. కొద్దిసేపు తరువాత పోలీస్​యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి నుంచి వృద్ధునికి వీడియో కాల్​వచ్చింది.

తనను తాను సైబర్​క్రైం ఇన్స్​పెక్టర్ నని చెప్పుకొన్న ఆ వ్యక్తి నీ వల్ల యువతి ఆత్మహత్య చేసుకుందని, నీపై హత్యానేరం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని చెప్పాడు. దాంతో భయపడిపోయిన వృద్ధుడు కేసు నుంచి తప్పించాలని అడుగగా సరే అన్న అపరిచిత వ్యక్తి మూడు విడతల్లో ఎనిమిది లక్షల రూపాయలను అతని నుంచి తీసుకున్నాడు. ఇంకా డబ్బు కావాలని వేధిస్తుండటంతో చివరకు సైబర్​క్రైం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఇదేవిధంగా 74 ఏళ్ల వయసున్న మరో వృద్ధున్ని కూడా సైబర్​నేరగాళ్లు భయపెట్టి ఏడు లక్షల రూపాయలను కొల్లగొట్టగా అతను కూడా సైబర్​క్రైం పోలీసులను ఆశ్రయించాడు.



Next Story

Most Viewed