Tragic incident:ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

by Jakkula Mamatha |
Tragic incident:ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
X

దిశ ప్రతినిధి, కృష్ణాజిల్లా: వారిద్దరూ పోలీసు దంపతులు. భర్త పమిడిముక్కల పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్. భార్య ఉయ్యూరు ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుల్. విధినిర్వహణలో సమయపాలనకు వీరిద్దరూ కంకణబద్ధులే. బుధవారం రాత్రి ఆమె నైట్ డ్యూటీ చేసింది. తెల్లవారుజామున బైక్ పై భార్యను ఇంటికి తీసుకు వెళ్తుండగా.. విధి కాటేసింది. ఓ గుర్తు తెలియని కారు వెనుక ఢీకొంది. అక్కడిక్కక్కడే భర్త ప్రాణాలు గాలిలో కలిశాయి. భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. వీరికి ఇద్దరు చిన్నారులు. తండ్రి ఇక లేడని తెలీదు. ఈ హృదయవిదారక ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలిసి జిల్లా ఎస్పీ గంగాధరరావు చలించిపోయారు. ప్రమాదస్థలికి వెళ్లారు. ఆసుపత్రిలో క్షతగాత్రురాలి పరిస్థితిని సమీక్షించారు. ఆమె ప్రాణాలు కాపాడాలని వైద్యులను కోరారు.

ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మత్తే రామకోటేశ్వరరావు పమిడిముక్కల పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. భార్య దుర్గాభవానీ ఉయ్యూరు ఎక్సైజ్ స్టేషన్ లో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గతంలో విజయవాడకు సమీపంలోని ఈడ్పుగల్లులో కాపురం కాగా.. ఇటీవల దుర్గాభవానీ తండ్రి ఆరోగ్యం దెబ్బతినటంతో డోకిపర్రుకు నివాసం మార్చారు. కంకిపాడు టోల్ గేట్ సమీపంలోని బ్రేవరేజీ కంపెనీ దగ్గర నైట్ డ్యూటీకి దుర్గాభవానీ వెళ్లారు. గురువారం తెల్లవారుజామున తిరిగి ఓ బైక్ పై ఇంటికి ఈ దంపతులు బయలుదేరారు. ఆకునూరు ఫ్లై ఓవర్ పై చేరే సరికి వెనుకగా వచ్చిన గుర్తు తెలియని కారు ఢీకొంది. వెంటనే ఆ కారులోని వ్యక్తులు పారిపోయారు. ఘటన స్థలిలోనే రామకోటేశ్వరరావు మృతి చెందగా.. దుర్గాభవానీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు. ఉయ్యూరు రూరల్ ఎస్సై సురేష్ బాబు ప్రమాద స్థలికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story