భార్య, కొడుకుపై కత్తితో భర్త దాడి..

by Disha Web Desk 13 |
భార్య, కొడుకుపై కత్తితో భర్త దాడి..
X

దిశ, నర్సంపేట: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యతో సహా కొడుకుపై కత్తితో హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. విశ్వసనీయ కథనం ప్రకారం.. చంద్రయ్య పల్లి గ్రామానికి చెందిన నిడిగొండ కోటి తన భార్య విజయ, కుమారుడు ప్రవీణ్ తో కలిసి హైదరాబాద్‌కి బతుకుదెరువు కోసం వెళ్లారు. అక్కడే కొన్ని ఏండ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భార్యపై కోటి కొన్ని సంవత్సరాలుగా అనుమానం పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిత్యం భార్య, కుమారుడు తో గొడవలకు దిగేవాడు. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ లు సైతం జరిగాయి.


ఇటీవల మళ్లీ గొడవలు జరుగుతుండడంతో కోటి సొంత గ్రామమైన చంద్రయ్యపల్లికి చేరుకున్నాడు. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో సోమవారం పంచాయితీ జరుగుతుండగా భార్య విజయ, కుమారుడు ప్రవీణ్ పై కోటి దాడి చేశాడు. ఇంట్లో వాడుకునే కత్తితో భార్య గొంతులో, కొడుకు ఛాతీపై తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. స్పందించిన స్థానికులు వారిని నర్సంపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ప్రవీణ్ కు తీవ్ర రక్తస్రావమైంది. అతని పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న నర్సంపేట పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Next Story