పెళ్లైన వారానికే ఇంట్లో శవాలుగా దంపతులు.. హత్యా.. ఆత్మహత్యా..?

by Disha Web Desk 19 |
పెళ్లైన వారానికే ఇంట్లో శవాలుగా దంపతులు.. హత్యా.. ఆత్మహత్యా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండో పెళ్లి చేసుకున్న ఓ మహిళ జీవితం అర్థాంతరంగా ముగిసింది. పెళ్లైన వారం రోజులకే తన రెండో భర్తతో సహా ఆ మహిళ సూసైడ్ చేసుకుంది. వారితో పాటు మొదటి భర్త వల్ల కలిగిన ముగ్గురు పిల్లలు సైతం అదే ఇంట్లో శవాలుగా పడి ఉండటం సంచలనంగా మారింది. హృదయవిదారకమైన ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటు చేసుకుంది. చెరువతూర్ ప్రాంతానికి చెందిన శ్రీజ గత వారం షాజీ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతడికి సైతం ఇది రెండో పెళ్లినే. అయితే విడాకులు తీసుకోకుండానే వీరిద్ధరు పెళ్లి చేసుకున్నారు. శ్రీజకు మొదటి భర్త సునీల్ ద్వారా కలిగిన సంతానం సూరజ్ (12), సుజిన్(8), సురభి (6) ఉన్నారు. ప్రస్తుతం ఈ చిన్నారులు తమ తల్లి శ్రీజతోనే ఉన్నారు.

ఏం జరిగిందో ఏమో కానీ బుధవారం ఉదయం శ్రీజ, షాజీ ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా చిన్నారులు ముగ్గురు ఇంట్లోని మెట్లపై విగతజీవులుగా పడి ఉన్నారు. కుటుంబ కలహాల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఈ మరణాల వెనుక ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే షాజీతో వివాహానికి శ్రీజ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారని వీరి వివాహం జరిగిన నాటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పెద్ద వాళ్ల సమస్యలు ఎలా ఉన్నా ముక్కుపచ్చలారని చిన్నారులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టు మార్టం రిపోర్ట్ వస్తే ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ తేలే అవకాశం ఉంది.

Next Story

Most Viewed