- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది.

దిశ,చంపాపేట్ : హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. వర్షాల కారణంగా రోడ్డుపై పడిన విద్యుత్ తీగలను గుర్తించలేక కరెంట్ షాక్‌కు గురైన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన జాఫర్, అబూ అనే యువకులు వర్షం సమయంలో ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షాల ప్రభావంతో తెగిపడి రోడ్డుపై పడిన విద్యుత్ తీగలు నీటిలో కలిసిపోవడంతో వాటిని గుర్తించలేకపోయారు. ఆటో నుంచి దిగిన వెంటనే విద్యుత్ ప్రవహిస్తున్న తీగలకు తాకడంతో ఇద్దరికీ తీవ్ర కరెంట్ షాక్ తగిలింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నించి ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకోగా, మృతుల కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. భారీ వర్షాల సమయంలో విద్యుత్ వ్యవస్థల నిర్వహణలో మరింత అప్రమత్తత అవసరమనే ప్రశ్నలు ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చాయి. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.






