అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు

by Sumithra |
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు
X

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం దమ్మపేట మండలం గట్టగూడెం గ్రామ శివారులో అశ్వారావుపేట - ఖమ్మం జాతీయ రహదారి పై అర్ధరాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జు అవ్వగా ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొక లారీలో ఉన్న డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడని తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అర్ధరాత్రి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను తీవ్రంగా శ్రమించి రక్షించారు. జేసీబీల సహాయంతో క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసి 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఐదు గంటలపాటు ట్రాఫిక్ జామ్

జాతీయ రహదారి పై రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఐదు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది వాహనాలు రోడ్డుకి ఇరువైపులా నిలిచిపోయాయి. పోలీసులు జేసీబీల సహాయంతో జాతీయ రహదారి పై ప్రమాదం జరిగిన లారీలను పక్కకు నెట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులకు కష్టం..

జాతీయ రహదారి పై ఇరువైపులా నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి పోలీసులు గంటల తరబడి కృషి చేశారు. ఒకవైపు లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను ఎంతో శ్రమించి బయటకు తీసి ఆస్పత్రికి పంపించడమే కాకుండా, ట్రాఫిక్ క్లియర్ చేయడంలోనూ అంతే శ్రమించారు. వందలాది వాహనాలు రహదారి పై నిలిచిపోవడంతో డ్రైవర్లు సహనంతో సహకరించడంతో ట్రాఫిక్ పరిస్థితి ఉదయం 6 గంటలకు అదుపులోకి వచ్చింది.



Next Story

Most Viewed