కుంభమేళ ప్రయాణంలో అపశృతి

by Sridhar Babu |
కుంభమేళ ప్రయాణంలో అపశృతి
X

దిశ, వెల్గటూర్ : కుంభ మేళా నుంచి తిరుగు ప్రయాణంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్‌లో పుణ్య స్నానం చేసి తిరిగి వస్తున్న క్రమంలో కారు యాక్సిడెంట్ కావడంతో ధర్మపురికి చెందిన ప్రమీల(55) అనే మహిళ మృతి చెందగా పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ధర్మ పురి పట్టణ వాసులు రెండు కార్లలో గతవారం కుంభమేళా యాత్రకు బయలుదేరారు. అక్కడ పుణ్య స్థానాలు ముగించుకొని తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ లోని రేవా ప్రాంతంలో వీరి కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ధర్మపురి పట్టణానికి చెందిన వెంగళ ప్రమీల అనే మహిళ తీవ్రంగా గాయపడింది.

కార్లో ఉన్న మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ప్రమీలను అక్కడి ప్రభుత్వ సహకారంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా ఆదివారం మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మపురి గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. ఇటీవలనే ఈమె భర్త కూడా గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ భారం మోసే ఇద్దరూ వెంట వెంటనే చనిపోవడం ఆ కుటుంబాన్ని తీవ్రమైన విషాదంలోకి నెట్టేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Next Story