గుప్త నిధుల కోసం తవ్వకాలు

by Sridhar Babu |
గుప్త నిధుల కోసం తవ్వకాలు
X

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామంలో చోటు చేసుకున్న గుప్త నిధుల తవ్వకాల ఘటన డివిజన్ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనపై పోలీసులు ఎటువంటి సమాచారం అందివ్వకపోవడంతో స్థానికంగా భిన్న వాదనలు మొదలయ్యాయి. కొందరిని ఈ కేసు నుండి తప్పిస్తున్నారన్న చర్చ శనివారం ఉదయం నుండి జరుగుతోంది. ఎట్టకేలకు శనివారం సాయంత్రం పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామానికి చెందిన రాయపురి కట్టయ్య ఇంటి వెనకాల పెరడులో కొంత మంది వ్యక్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, ప్రభుత్వానికి తెలియచేయకుండా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు.

పది మంది గుప్త నిధుల తవ్వకాలలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీ సహా ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన వారిలో ఇంటి యజమాని రాయపురి కట్టయ్య, వేణుగోపాల్, గడ్డం నరేందర్, గొడుగు నగేష్, కన్నెబోయిన పెద్దరాజు, కసమ్మల నరేష్, తుమ్మ వినోద్ కుమార్, నాంపల్లి రామకృష్ణ, భిక్షపతి, శ్యామ్ లపై కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరికొందరు కలిసి తవ్వకాలకు పాల్పడినట్లు పోలీసులు స్పష్టం చేశారు. గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రజాక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నర్సంపేట మండల పరిధిలో ఎవరైనా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Next Story