నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు.. అంతర్ రాష్ట్ర కేడీల ఆట కట్టించిన పోలీసులు

by Disha Web Desk 19 |
నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు.. అంతర్ రాష్ట్ర కేడీల ఆట కట్టించిన పోలీసులు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నకిలీ బ్యాంక్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పలువురిని మోసం చేస్తున్న 10 మంది అంతర్ రాష్ట్ర ముఠాను సీసీఎస్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సీసీఎస్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ నోయిడాకు చెందిన నీరజ్ కుమార్ (35), రోహిత్ కుమార్ (28), అకాష్ కుమార్ (23), అజయ్ సింగ్ (23), సచన్ వైష్ణవి (19), ప్రియాంక శర్మ (28), ఢిల్లీకి చెందిన ప్రగ్యా టాండన్ (22), హిమాంశి కటేరి (22), రాధిక ధమిజ (22), ప్రీతికుమారి (20)లు నోయిడాలో ఫేక్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వీరు బ్యాంక్ ఖాతాదారుల ఫోన్ నెంబర్‌లు సేకరించి తమ డెబిట్ కార్డుపై ఉన్న రివార్డు పాయింట్లు క్లెయిమ్ చేసుకోవాలని, లేకపోతే మీరు నష్టపోతారని సూచిస్తున్నారు. తాము క్లెయిం చేసి పెడతామని, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ తమకు చెప్పాలని కోరుతూ చెప్పిన వారి ఖాతాల నుండి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కంచన్ బాగ్‌కు చెందిన ఓ మహిళకు గత నెల 11వ తేదీన ఫోన్ చేసి తాము ఎస్బీఐ కాల్ సెంటర్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి రివార్డు పాయింట్లు క్లెయిం చేసుకోవాలని, ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరారు. దీంతో ఆమె వారు కోరినట్లుగా ఓటీపీ చెప్పడంతో మూడు దఫాలుగా రూ. లక్షను కాజేశారు. అనంతరం ఫోన్‌లు స్విచ్ఛాప్ కావడంతో ఆమె మోసపోయానని గుర్తించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీసీఎస్ ఇన్ స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేశారు. నిందితులు అంతా యూపీ, ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించి ఎస్ఐ నరేష్, పీసీల బృందం మహేశ్వర్ రెడ్డి, ఎండీ ఫిరోజ్, జి మహేష్, ఎం మహేష్, గాజేశ్వర్ తదితరులు అక్కడికి వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు. వారి వద్ద నుండి 252 మొబైల్ ఫోన్స్, 103 ల్యాప్ ట్యాప్‌లు, 14 హార్డ్ డిస్క్‌లు, 6 సిమ్ కార్డులు, 2 గోల్డ్ చైన్స్, 27 గోల్డ్ రింగులు, 1 గోల్డ్ కడియంను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసులో నిందితులను అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు వారిని అభినందించారు.


Next Story