నన్నే బస్సు దిగమంటావా..? కండక్టర్‌ను హత్య చేసిన ప్రయాణికుడు

by samatah |   ( Updated:2022-05-15 13:52:38.0  )
నన్నే బస్సు దిగమంటావా..? కండక్టర్‌ను హత్య చేసిన ప్రయాణికుడు
X

దిశ, వెబ్‌డెస్క్: బస్సులో ఓ తాగుబోతు చేసిన పనికి కండక్టర్‌ చనిపోయాడు.టికెట్టు తీసుకోవాలని కండక్టర్ అడిగినందుకు అతడిని మట్టుబెట్టాడు. తాగిన మత్తులోనే ఇంతటి ఘాతుకానికి దిగాడు. తమిళనాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోయంబేడు బస్టాండ్ నుండి విల్లుపురానికి బస్సు శనివారం వేకువజామున బయలు దేరింది. ఉదయం 4గంటల సమయంలో మధురాంతకం బస్టాండ్‌లో కొందరు ప్రయాణికులు ఎక్కారు. వీరిలో పీకలదాకా మద్యం సేవించిన 40 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. బస్సు కండక్టర్ పెరుమాళ్(55) ఆ వ్యక్తిని టికెట్ తీసుకోమని అడిగాడు. దీంతో ఆగ్రహించిన అతడు కండక్టర్‌తో గొడవకు దిగాడు.

ఎంతకీ టికెట్టు తీసుకోకపోవడంతో కండక్టర్ బస్సు ఆపి ఆ వ్యక్తిని కిందికి దించేందుకు ప్రయత్నించగా.. మద్యం మత్తులో అతడు ఆగ్రహంతో కండక్టర్‌పై దాడికి దిగాడు. ఈ ఘర్షణలో కండక్టర్ కిందపడటంతో తలకు తీవ్రమైన గాయమైంది. వెంటనే బస్ డ్రైవర్‌తోపాటు స్థానికులు కండక్టర్‌ను చికిత్స నిమిత్తం మేల్‌మరువత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే కండక్టర్ చనిపోయాడు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు.. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. నిందుతుడు మురుగన్(తాగుబోతు) అరెస్టు చేశారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను జారీ చేశారు. ''విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ పెరుమాళ్ మరణం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురుయ్యాను. కండక్టర్ కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.'' అని పేర్కొన్నారు. అంతే కాకుండా బాధిత కుటుంబీకులను ఓదార్చి ప్రభుత్వం తరుపున రూ.10 లక్షలు ఆర్థికసాయం అందించారు.

Advertisement

Next Story

Most Viewed