మునిగిన వలస నౌక.. 79 మంది జలసమాధి

by Dishafeatures2 |
మునిగిన వలస నౌక.. 79 మంది జలసమాధి
X

కలమట (గ్రీస్) : గ్రీస్ తీరంలో దారుణం జరిగింది. ఉపాధి అవకాశాలను వెతుకుతూ పొట్ట చేత పట్టుకొని ఫిషింగ్ బోట్ లో ఐరోపాకు బయలుదేరిన 500 మంది శరణార్ధుల్లో 79 మంది జల సమాధి అయ్యారు. వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో విషాదం చోటుచేసుకుంది. గ్రీస్‌లోని దక్షిణ పెలోపొన్నీస్ ద్వీపకల్పానికి నైరుతి దిశలో 75 కి.మీ దూరంలో ఉన్న మధ్యధరా సముద్రపు అంతర్జాతీయ జలాల్లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యధరా సముద్రంలో 17000 అడుగుల (5,200 మీటర్లు) లోతు ఉన్న ప్రాంతంలో ఈ సంఘటన జరిగినందు వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ దుర్ఘటనలో 104 మందిని రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. వారికి కలమట ఓడరేవు వద్ద

చికిత్స అందించి తాత్కాలిక షెల్టర్ కల్పిస్తున్నారు. వందలాది మంది సముద్రంలో గల్లంతయ్యారు. కోస్ట్‌గార్డ్, నావికా దళం, మర్చంట్ నౌకలు, విమానాల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీలం రంగులో ఉన్న ఫిషింగ్ బోట్ ఒక అంగుళం జాగా కూడా ఖాళీ లేకుండా 500 మందితో బయలుదేరిందని తెలిపే ఒక ఫొటోను గ్రీక్ కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. ఈ లెక్కన మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికులు ఓ వైపునకు అకస్మాత్తుగా చేరుకోవడం వల్ల ఫిషింగ్ బోట్ బ్యాలెన్స్ కోల్పోయి మునిగిపోయి ఉంటుందని కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి నికోస్ అలెక్సియో తెలిపారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ గ్రీస్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఐయన్నిస్ సర్మస్ మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. గ్రీస్ ని దాటుకొని ఇటలీకి చేరుకునేందుకు స్మగ్లర్లు ఎక్కువగా ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. ప్రమాదం బారిన పడిన పడవ.. తూర్పు లిబియా లోని తోబ్రాక్ నుంచి ఇటలీకి వలసదారులతో బయలుదేరినట్టు అనుమానిస్తున్నారు. ఈవిషయాన్ని ఇటలీ కోస్ట్ గార్డు గుర్తించి ముందుగానే గ్రీస్ అధికారులతో పాటు యూరోపియన్ యూనియన్ సరిహద్దు రక్షణ ఏజెన్సీలను అప్రమత్తం చేసింది.


Next Story