శామీర్ పేట చెరువులో పడి యువకుడు మృతి..

by Disha Web Desk 11 |
శామీర్ పేట చెరువులో పడి యువకుడు మృతి..
X

దిశ, శామీర్ పేట: ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన గురువారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకనగర్ కింది బస్తీకి చెందిన అమీర్ ఖాన్ (22) తన కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం కౌకూర్ దర్గాకు బయలుదేరారు. దర్గా పరిసర ప్రాంతానికి చేరుకోగానే అమీర్ ఖాన్ ముందుగా శామీర్ పేట చెరువును చూసి ఆ తరువాత కౌకూర్ దర్గాకు వెళదామని అనడంతో అందరు కలిసి శామీర్ పేట చెరువుకు చేరుకున్నారు.

చెరువును అనుకోని ఉన్న బంగారు తెలంగాణ విగ్రహం దగ్గర కుటుంబ సభ్యులు ఉండగా అమీర్ ఖాన్ చెరువు వద్దకు వెళ్లి నీళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఎంతసేపటికి అమీర్ ఖాన్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు ప్రాంగణంలో వెతకడం మొదలు పెట్టారు. ఇంకా లాభం లేకపోవడంతో శామీర్ పేట పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో చెరువులో వెతికి అమీర్ ఖాన్ మృతదేహాన్ని బయటకు తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Next Story