కారును 400 మీటర్లు ఈడ్చుకెళ్లిన కంటైనర్.. అరచి గీ పెట్టినా లారీ ఆపని డ్రైవర్..!

by Disha Web Desk 19 |
కారును 400 మీటర్లు ఈడ్చుకెళ్లిన కంటైనర్.. అరచి గీ పెట్టినా లారీ ఆపని డ్రైవర్..!
X

దిశ, భిక్కనూరు: మరి కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్నారు ఆ దంపతులు.. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురి అయ్యింది. భయానక పరిస్థితులను, ప్రమాద తీవ్రతను ప్రత్యక్షంగా చూస్తూ నరకయాతనను అనుభవించిన ఆ దంపతులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేక పోతున్నారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మాదంశెట్టి ఆంజనేయులు వ్యాపార రీత్యా కామారెడ్డిలో స్థిరపడ్డాడు. రెండు రోజుల క్రితం తన కుమారుడు సంతోష్, కుమార్తె రిశాంక్‌లను కళాశాలలో చేర్పించేందుకు కారులో భార్యతో సహ హైదరాబాద్‌కు బయలుదేరాడు. అక్కడ పిల్లలను దింపి తిరుగు ప్రయాణం అయ్యారు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును వెనక నుండి వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ ముందు ఉన్న బంపర్‌కు కారు ఇరుక్కోవడంతో కారు అడ్డంగా తిరగింది. అయినప్పటికీ కంటైనర్ డ్రైవర్ ఆపకుండా సుమారు నాలుగు వందల మీటర్లు అలాగే ఈడ్చుకెళ్ళాడు. కంటైనర్ డ్రైవర్ స్పీడ్ కంట్రోల్ చేయకపోవడం, కారులో ఉన్న దంపతులు లోపలి నుంచి కేకలు పెడుతున్నా.. కంటైనర్ డ్రైవర్‌కు వినబడకపోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అప్పటికే కారు టైర్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

అలాగే కొంత దూరం వెళ్లాక కంటైనర్ నుండి వేరైన కారు రోడ్డుపై ఆగిపోవడంతో ఆ దంపతులు ఊపీరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మాత్రం కొద్ది దూరం వెళ్ళాక కంటైనర్‌ను పక్కకు ఆపి పరారయ్యాడు. ప్రమాద విషయమై ఫిర్యాదు చేసేందుకు భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం వచ్చిన కారు యజమాని మాదంశెట్టి ఆంజనేయులు ''దిశ''తో మాట్లాడుతూ జరిగిన విషయాన్ని వివరించారు.


Next Story

Most Viewed