పాతకక్షలకు నిండు ప్రాణం బలి

by Sumithra |   ( Updated:2025-04-15 04:25:37.0  )
పాతకక్షలకు నిండు ప్రాణం బలి
X

దిశ, మాక్లూర్ : మాక్లూర్ మండలం చిక్కిలి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాక్లూర్, నవీపేట్ పోలిస్టేషన్ ఎస్సైల పర్యవేక్షణలో మంగళవారం గ్రామంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన ర్యాపని గంగారాం, కారం నవీన్ మధ్యలో ఉన్న పాత కక్షలు ఒకరి మృతికి కారణం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం గంగారాం, నవీన్ ల మధ్య వ్యవసాయ పొలం వద్ద తరచూ గొడవలు జరిగేవి.

ప్రతి సంవత్సరం ఈ సమస్య జఠిలం కావడంతో ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నవీన్, గంగారాం మధ్య ఏర్పడిన ఘర్షణ దాడికి దారితీసింది. నవీన్ తన ట్రాక్టర్ తో గంగారాంను బలంగా ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుని కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు తొలుత హత్యయత్నం తర్వాత హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Next Story

Most Viewed