నకిలీ పోలీసుల ముఠా గుట్టు..రట్టు

by Disha Web Desk 1 |
నకిలీ పోలీసుల ముఠా గుట్టు..రట్టు
X

ఇద్దరు అరెస్టు.. పరారీలో మరో ఐదుగురు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పోలీసుల పేరిట ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టైంది.పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. సులువుగా డబ్బు సంపాదించి, విలాసవంతమైన జీవితం గడపాలనుకున్న కట్కూరి సాయి శరత్ రెడ్డి 2018లో ఓఎల్ఎక్స్ లో జాబ్ లు ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతుండగా ఐదు కేసుల్లో కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి జైలు పంపగా, ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు.

అన్ లైన్ మోసాలకు అకర్షితుడైన కట్కూరి సాయిశరత్ రెడ్డి, ఎండీ.నవీద్, ఆకుల కిరణ్, కేశవరపు శివసాయి, గార్లపాటి సుమంత్, పొడపత్రం రణధీర్, మధులు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే 2023 మార్చి 13న శరత్ రెడ్డి, సుమంత్, నవీద్, రణధీర్ కలిసి సిద్దిపేట జిల్లా ములుగు మీసేవ వారికి ఎఎస్ ఐ అశోక్ రెడ్డిని మాట్లాడుతున్నానని చెప్పి రూ.25 వేలు ఘటకేసర్ దగ్గరలో గల మీసేవలో వేయించుకున్నారు. అదే రోజు మీసేవ దగ్గరకు వెళ్లి మిగతా వారందరూ కారులో ఉండగా శరత్ రెడ్డి వెళ్లి ఆ డబ్బును తీసుకుంటున్న సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

ఏప్రిల్ 7న శరత్ రెడ్డి, సుమంత్, నవీద్, రణధీర్ కలిసి దుబ్బాక మీసేవ వారికి ఎఎస్ఐని మాట్లాడుతున్నానని చెప్పి రూ.20వేలు పెట్రోల్ పంపులో వేయించుకున్నారు. ఏప్రిల్ 19న గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్గల్ మీసేవ సెంటర్ కు పోలీసుల పేరిట ఫోన్ చేసి నగదు పంపిస్తున్నామని అన్ లైన్ పేమెంట్ చేయాలని నిందితులు సూచించగా డబ్బును వనస్థలిపురం పెట్రోల్ పంప్ వారికి పంపించారు.

అక్కడ సిద్ధంగా ఉన్న శరత్ రెడ్డి, సుమంత్, రణధీర్ డబ్బు తీసుకుని అక్కడి నుంచి జంప్ అయ్యారు. అదేవిధంగా ఇదే తరహాలో ఖమ్మం జిల్లా నెలకొండపల్లి, యెల్లారెడ్డి, బోధన్, దుబ్బాక, కల్వకుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో మోసాలకు పాల్పడినట్లు గుర్తించనట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు గజ్వేల్ ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలోని స్పెషల్ టీం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కట్కూరి సాయిశరత్ రెడ్డి, ఎండీ.నవీద్ లను అరెస్టు చేశారు.

వారితో పాటు మోసాలకు పాల్పడిన ఆకుల కిరణ్, కేశవరపు శివసాయి, గార్లపాటి సుమంత్, పొడపత్రం రణధీర్, మధులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైం జరిగిన వెంటనే 1930కి కాల్ చేస్తే డబ్బు రికవరీ చేసే అవకాశం ఉంటున్నారు. ఈ సమావేశంలో గజ్వేల్ ఏసీబీ రమేష్, గజ్వేల్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ సంపత్, కానిస్టేబుళ్లు మహేష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed