నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

by Kalyani |
నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
X

దిశ, జడ్చర్ల: వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్ర గాయాలై, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డు నిమ్మబావిగడ్డ ఫసల్ బండకాలనీలో బాలుడు అమన్ తన ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో కుక్కలు అమన్ పై మూకుమ్మడిగా దాడి చేస్తుండగా గమనించిన పొరుగు ఇంటి మహిళ వీధి కుక్కలను కర్రలతో, రాళ్లతో బెదిరించి తరిమేసింది. అమన్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు అమన్ ను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అమన్ ఆరోగ్యానికి ప్రమాదమేమి లేదని వైద్యులు తెలపడంతో బాలుడి తల్లిదండ్రులు, కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాలుడిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయని బాలుడి తండ్రి మన్నన్ ఆరోపించాడు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కాలనీలో వీధి కుక్కలు, పందుల బెడదకు నివారణ చర్యలు చేపట్టి, తమ పిల్లలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది ఇలా ఉండగా గాయపడిన అమన్ ను జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్ నిమ్మబావిగడ్డలోని బాలుడి ఇంటికి వెళ్లి బాలుడిని, తల్లిదండ్రులను పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఎర్ర శేఖర్ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపాలిటీలో కుక్కల బెడద అధికంగా ఉందని వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Next Story

Most Viewed