ఆ దేశంతో సైనిక పొత్తు మనకే ముప్పు : CPIM, CPI

by  |
ఆ దేశంతో సైనిక పొత్తు మనకే ముప్పు : CPIM, CPI
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాతో సైనిక పొత్తు వలన మన దేశ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లుతుందని సీపీఐ(ఎం), సీపీఐ అభిప్రాయపడ్డాయి. నిన్న ఢిల్లీలో భారత్‌, అమెరికా రక్షణ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన 2+2 సమావేశంలో భౌగోళిక, ప్రాదేశిక సహకారానికి సంబంధించి అమెరికాతో సైనిక పొత్తు (BECA) ఒప్పందాన్ని భారత్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి రాజా బుధవారం సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. ఆసియాలో అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహంలో భారత్‌ బంటుగా మారడం మినహా దీని వల్ల మనకు ఒరిగేదేమీ లేదని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి.

తాజా ఒప్పందంతో భారత్‌, అమెరికా మధ్య సైనిక పొత్తుకు అవసరమైన మౌలిక ఒప్పందాలన్నీ పూర్తి చేసినట్లయిందని పేర్కొన్నాయి. క్వాడ్‌ (చతుర్ముఖ కూటమి) భాగస్వాముల మధ్య ‘మలబార్‌ విన్యాసాలు’ పేరుతో జరిగే సంయుక్త నావికా విన్యాసాలు నవంబరులో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఇరుదేశాలు ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవల లడఖ్‌లో LAC పొడవునా చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలను సాకుగా చూపి ఈ ఒప్పందాన్ని సమర్థించుకోవడానికి మోడీ ప్రభుత్వం యత్నించడం సరికాదని కమ్యూనిస్టు పార్టీలు తెలిపాయి.వాస్తవానికి , చైనాతో ప్రతిష్టంభన ఏర్పడడానికి చాలా కాలం ముందు నుంచే ఈ ఒప్పందాలకు సంబంధించిన చర్యలు చేపట్టారని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. కొద్ది సంవత్సరాల కిందటే లాజిస్టిక్స్‌ ఎక్సేఛేంజ్‌ అగ్రిమెంట్‌, కమ్యూనికేషన్స్‌ సెక్యూరిటీ అగ్రిమెంట్‌లను కుదుర్చుకోవడం, క్వాడ్‌ ఫోరమ్‌ను నవీకరించడం వంటి చర్యలను ఇరు దేశాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాయి.

తాజా ఒప్పందాల నేపథ్యంలో భారత సాయుధ బలగాలు, అమెరికా సైన్యానికి, దాని వ్యూహాత్మక చర్యలకు కట్టుబడి వుండాల్సి వస్తుందన్నాయి. కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను అనుసంథానించడం వల్ల భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిపైన, స్వతంత్ర విదేశాంగ విధానంపైన అది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని హెచ్చరించాయి. ఈ ఒప్పందాలన్నీ మనం అమెరికా ఆయుధాలపై ఆధారపడేలా చేస్తాయి. అమెరికా ఆయుధ వ్యవస్థ సాంకేతికత, వ్యవస్థలన్నీ పూర్తిగా అమెరికా ప్రభుత్వ నియంత్రణ కిందికి వెళ్లిపోతాయి. ఈ పర్యవసానాలు జాతీయ ప్రయోజనాలకు ఏమాత్రమూ అనుగుణంగా వుండవని తేల్చిచెప్పాయి. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉన్నత రాజకీయ, దౌత్య స్థాయిల్లో చైనాతో భారత ప్రభుత్వం చర్చలు కొనసాగించవచ్చు. దీనికోసం ఆసియాలో అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహానికి భారత్‌ తలొగ్గాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదని సీపీఐ(ఎం), సీపీఐ స్పష్టం చేశాయి.



Next Story