టాక్సీ స్టాండ్‌ను కబ్జా చేసిన కౌన్సిలర్.. బిత్తర చూపులతో నోరెళ్లబెడుతున్న డ్రైవర్లు

by  |
armoor1
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ కట్ట ప్రాంతంలో ఉన్న టాక్సీ స్టాండ్ పై ఓ కౌన్సిలర్ కన్నేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే 2 కోకాలు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా సదరు స్థలంలో టాక్సీలు నిలుపుకుంటూ ఉపాధి పొందుతున్న ప్రైవేటు డ్రైవర్లు కౌన్సిలర్ చేసిన పనికి దిక్కు తోచక బిత్తర చూపులు చూస్తున్నారు. ఆర్మూర్ పట్టణం నడిబొడ్డున బస్టాండ్ ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కౌన్సిలర్ బాజాప్తాగా ఆక్రమించడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాము హక్కు కలిగి ఉన్న స్థలాన్ని ఎలా కబ్జా చేస్తావని అడిగిన ప్రైవేటు వాహనదారులపై దౌర్జన్యం ప్రదర్శిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అధికార బలంతో ఆగడాలు చేస్తున్న కౌన్సిలర్ తీరుపై పట్టణవాసులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జి పక్కన ఉన్న ఇరిగేషన్ స్థలంలో కెనాల్ బౌండరీలో టాక్సీ డ్రైవర్లు గత కొన్ని సంవత్సరాలుగా తమ వాహనాలు నిలుపుకొంటున్నారు. ఈ స్థలంపై కన్నేసిన కౌన్సిలర్ వనం శేఖర్ ఏకంగా 2 కోకాలను ఏర్పాటు చేశాడు. టాక్సీ డ్రైవర్లు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ బెదిరింపులకు పాల్పడడంతో స్థానికులు విస్తుపోతున్నారు. రోజులాగే శుక్రవారం ఉదయం టాక్సీ స్టాండ్ కు చేరుకున్న డ్రైవర్లు కోకాలను చూసి నోరెళ్లబెట్టారు. ఇదే కార్పొరేటర్ ఇటీవల దీపావళి సందర్భంగా పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులు భయం గుప్పిట క్రయవిక్రయాలు సాగించేలా చేసి అపవాదు మూటగట్టుకున్నారు. మరోమారు ఇలా దౌర్జన్యంగా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ పేద కార్మికులైన టాక్సీవాలాల పొట్ట కొట్టే ప్రయత్నం చేయడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed