తెల్ల బంగారం రైతు తెల్లబోతున్నాడు!

by  |
తెల్ల బంగారం రైతు తెల్లబోతున్నాడు!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన మారగోని లచ్చయ్య తనకున్న ఐదెకరాలతో పాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. మొదటి దశ పత్తిని సేకరించే సమయంలో వరుస వర్షాలతో చేతికందిన పత్తి అక్కరకు రాకుండా పోయింది. కనీసం పత్తిని సేకరించేందుకు సైతం పత్తి చేలు అనుకూలంగా లేవు. అయినా 10 మంది కూలీలు తీసే పత్తిని 20 మంది తీయించాల్సి వచ్చింది. అదే సమయంలో పత్తి తడిసి ముద్ధవ్వడంతో ఎక్కువ రోజులు నిల్వ ఉండే పరిస్థితి లేదు. అమ్ముదామంటే.. సీసీఐ కేంద్రాలు తెరుచుకోలేదు. దీంతో పత్తిలో తేమ ఉండడం వల్ల నల్లబారిపోతోంది. అందుకోసం రోజుకు నలుగురు కూలీలను పెట్టి రోజంతా పత్తిని ఎండకు ఆరబోస్తున్నాడు. అయినా ఇప్పట్లో సీసీఐ కేంద్రాలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో మూడు రోజుల క్రితం దళారులకు క్వింటాల్ రూ.3200 చొప్పున 21 క్వింటాళ్ల పత్తిని దళారులకు అమ్మేశాడు. అదే సీసీఐ కేంద్రంలో లచ్చయ్య పత్తిని అమ్ముకుని ఉంటే.. రూ.లక్షకు పైగానే డబ్బు వచ్చేది. కానీ దళారులు కేవలం రూ.65 వేలు మాత్రమే చేతిలో పెట్టి వెళ్లారు. ఎటూ లేదన్న లచ్చయ్యకు రూ.40 వేలకు పైగానే నష్టం వచ్చిందనే చెప్పాలి.

వరుసగా కురిసిన వర్షాలు రైతులను నిండాముంచాయి. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో పండించిన తెల్లబంగారంపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించిన రైతులకు కనీసం పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేదు. గతంలో ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడులు వచ్చేవి. ఎంత సారం లేని భూమిలో అయిన తక్కువలో తక్కువ 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గేదికాదు. కానీ ప్రస్తుతం ఎంత పండినా ఎకరాకు ఐదారు క్వింటాళ్ల మించితే గొప్పనని రైతులు చెబుతున్నారు. వాస్తవానికి నల్లగొండ జిల్లాలో గతేడాది పత్తి పంట రైతులకు సిరులను కురిపించింది. ఆ ఆశతోనే నల్లగొండ జిల్లా పరిధిలో రైతులు భారీగా పత్తిపంటను సాగు చేశారు. కానీ ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఊహించని నష్టాలను చవిచూసే పరిస్థితి నెలకొంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ప్రస్తుత సీజనులో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. జిల్లాల వారీగా చూస్తే.. నల్లగొండ జిల్లాలో 7,29,405 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 1,35,454 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 1,78,890 ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేశారు. గతేడాది కంటే ఇది చాలా అధికమనే చెప్పాలి. ఒక్క నల్లగొండ జిల్లాలో 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. అందులో సగం దిగుబడులు కూడా వచ్చే అవకాశం కన్పించడం లేదు. పత్తి సేకరణ కంటే ముందే దాదాపు 9 వేల ఎకరాల్లో వరుస వర్షాల వల్ల పత్తిపంట దెబ్బతింది. పత్తి సాగు ప్రారంభంలో సాధారణంగా ఒకట్రెండు సార్లు మాత్రమే పత్తి విత్తనాలను విత్తేవారు. కానీ అందుకు భిన్నంగా ఈ యేడు మూడు నాలుగు సార్లకు పైగానే విత్తనాలను విత్తాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. దీంతో రైతులు తడిసిన పత్తిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. దీన్ని అదునుగా భావించిన దళారులు క్వింటాల్ పత్తిని రూ.3200 నుంచి రూ.4వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టోతున్నారు.

ఎకరాకు రూ.30వేలకు పైనే పెట్టుబడి..

వాస్తవానికి పత్తిపంట కలిసొస్తే.. ఏడాదిలోనే అప్పులు తీర్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఏమాత్రం తేడా వచ్చినా అప్పుల ఊబిలో నుంచి బయటపడడం గగనమే అవుతుంది. పత్తి సాగు చేస్తారన్న దగ్గరి నుంచి మార్కెటులో విక్రయించుకునే వరకు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తుంది. పత్తి గింజ నాటినప్పట్నుంచి చేనులో కలుపు, పిండి మందులు, పురుగు మందులు పిచికారీ చేయడం, పత్తి సేకరించడం, మార్కెటుకు తరలించడం తదితర వాటికి ఒక్కో ఎకరాకు రూ.30వేలకు పైగానే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అదే కౌలు రైతులైతే.. ఈ పెట్టుబడికి అదనంగా ఎకరాకు రూ.15వేలకు పైగా కౌలు చెల్లిస్తారు. అన్ని కలుపుకుంటే.. కౌలు రైతు ఎకరాకు రూ.45వేలు ఖర్చుచేస్తాడు. ఇదిలావుంటే.. ఈ ఏడాది ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి మించేలా లేదు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం సగటును క్వింటాల్‌కు రూ.5వేలు ధర పలికినా.. ఐదు క్వింటాళ్లకు రూ.25వేలు మించి రైతు చేతికి అందదు. అంటే సొంత భూమి ఉన్న పత్తి రైతుకు ఎకరాకు రూ.5వేలకు పైగా నష్టం వస్తుండగా, కౌలు రైతు విషయానికొస్తే.. రూ.20వేలకు పైగా నష్టపోతున్నాడు. సాధారణంగా అధిక శాతం మంది రైతులు మూడెకరాల నుంచి ఐదెకరాల వరకు పత్తి పంటను సాగు చేశారు. మొత్తంగా కౌలు రైతు రూ.60 వేల నుంచి రూ.లక్షకు పైగానే నష్టపోయాడు.

బ్యాంకులు రుణాలిచ్చి ఉంటే..

ఒక్కో రైతు సగటున రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పత్తి పంట సాగు మీద నష్టపోయాడు. గతంలో తక్కువ పత్తిసాగు చేసిన రైతులు సైతం.. సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చిన నియంత్రిత పంటల సాగులో భాగంగా పత్తిని సాగు చేశారు. అదీ కూడా రైతులు అధికంగా నష్టపోయేందుకు కారణమయ్యింది. ఇదిలావుంటే.. పత్తి సాగుకు పెట్టుబడి అధికంగా పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గానీ రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లలో కాస్తో కూస్తో రైతులకు రుణాలిచ్చేవారు. కానీ గత మూడు నాలుగేండ్లుగా రైతులకు రుణాలన్న సంగతే మర్చిపోయారు. పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టుకుని రుణాలు ఇచ్చినా.. రుణమాఫీ కింద ప్రభుత్వం బ్యాంకులకు ఏండ్లు గడిచినా నిధులు మంజూరు చేయలేదు. దీంతో బ్యాంకర్లు కొత్త రుణాలను రైతులకు ఇవ్వడంలో తీవ్ర అలసత్వం చూపుతున్నారు. దీంతో పంటల పెట్టుబడి కోసం ఏ దిక్కు లేక రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు చేసి.. ఇప్పడు సరైన దిగుబడులు లేక తలలు పట్టుకుంటున్నారు.


Next Story

Most Viewed