ధాన్యం కొనుగోళ్లలో అవినీతిని అరికట్టాలి

by  |
Sunketa Anvesh Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 80 శాతం రబీలో వరికోతలు ముగిశాయని, పంటను కొనుగోలు కేంద్రాల్లో పోశారని, కానీ నేటికి కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదన్నారు.

అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుందని వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. 5690 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే ఇప్పటి వరకు 13.38 లక్షల మెట్రిక్ టన్నులే ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామనే మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని ఆరోపించారు. మిల్లర్లు తరుగుపేరుతో క్వింటాకు 5 నుంచి 10 కిలోలు తీస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన వెంటనే ట్రాక్ సిట్ ఇవ్వాలని, దాని ప్రకారమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed