స్వపక్షంలో విపక్షం.. అధికారుల తీరుపై కార్పొరేటర్ల నిరసన

by  |
స్వపక్షంలో విపక్షం.. అధికారుల తీరుపై కార్పొరేటర్ల నిరసన
X

దిశ, గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుందా? అంటే ప్రజల నుండి అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ లలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రజలు రోడ్డెక్కే పరిస్థితులు పోయి కార్పొరేటర్లు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి చెందిన రామగుండం 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ గత మూడు నెలలుగా రామగుండం కార్పొరేషన్ అధికారుల తీరుపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కార్పొరేషన్ లో అవినీతి అధికారి అంటూ బహిరంగంగా విమర్శించినా.. స్థానిక నాయకులు దీనిపై నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇది మరువకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన 24వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక సుజాత తమ డివిజన్ ఎన్టీపీసీ జ్యోతి నగర్ పరిధిలో రోడ్డు గుంతలు గుంతలుగా మారడంతో నిత్యం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రామగుండం కార్పొరేషన్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడంతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో అధికారుల పని తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు తమ డివిజన్ లలో పలు సమస్యలు ఉన్నాయని, చెత్తతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇలా కొన్ని డివిజన్ లలో కొంతమంది కార్పొరేటర్లను అధికారులు చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో రామగుండం నియోజకవర్గంలో అధికారుల తీరు చర్చనీయాంశంగా మారుతుంది.


Next Story

Most Viewed