పరేషాన్‌లో కార్పొరేషన్లు

by  |
పరేషాన్‌లో కార్పొరేషన్లు
X

-ప్రభుత్వం గ్యారంటీలిస్తేనే
బ్యాంకుల నుంచి కొత్త అప్పలు

-మార్చి వరకు 40వేల కోట్లకుపైగా
గ్యారంటీలిచ్చిన సర్కారు

-లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో భారీగా
పెరగనున్నబడ్జెట్ బయట అప్పులు

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం ప్రభుత్వ ఖజానా మీదే కాక రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కార్పొరేషన్ల ఆర్థిక నిర్వహణపైనా ప్రభావం చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనిని నేరుగా కాకుండా కొన్ని ప్రత్యేక అవసరాల కోసం స్పెషల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చక్కబెట్టాల్సి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వంలోనూ పలు రకాల ముఖ్యమైన, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకుగాను కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవి ఆయా ప్రభుత్వ శాఖల కింద ఉంటూ వాటి నిర్వహణను అవే చక్కబెడుతూ వనరుల నిర్వహణను సొంతగా చేస్తుంటాయి. అవసరమైతే అదనపు నిధుల కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తుంటాయి. వీటికి కావాల్సిన నిధులు ప్రభుత్వం దగ్గర సైతం అందుబాటులో లేనపుడు బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం వాటికి సూచిస్తుంటుంది. రుణాలకు ప్రభుత్వం గ్యారంటీలిస్తూ ఉంటుంది. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రజారవాణా కోసం ఏర్పాటు చేసిన రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(ఆర్టీసీ), విద్యుతుత్పత్తి, సరఫరా కోసం ఏర్పాటు చేసిన జెన్ కో, ట్రాన్స్ కో, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, సింగరేణి తదితరాలు ఈ కోవలోకే వస్తాయి. అయితే ఇప్పడు కరోనా వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో పాటు వీటి ఆర్థిక పరిస్థితి సైతం ప్రమాదంలో పడే చాన్సులున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వామిచ్చే సబ్సిడీల భారం మోస్తూ ఆ చెల్లింపులు సకాలంలో అందక సతమవుతున్న ఈ సంస్థలకు లాక్‌డౌన్‌తో సాధారణంగా వచ్చే కొద్దిపాటి ఆదాయ వనరులూ వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. దీంతో లాభాల్లో ఉన్న ఒక్క సింగరేణి తప్ప ఇప్పటికే పుట్టెడు అప్పుల్లో ఉన్న ఆర్టీసీ, పవర్ కంపెనీల లాంటి కార్పొరేషన్లు ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం వీటికి లోను లేదా గ్రాంటు రూపంలో సహాయం చేస్తుంది. అయితే లాక్ డౌన్‌తో ప్రభుత్వమే నిధుల కోసం ఆర్బీఐ తలుపు తట్టి ఓవర్ డ్రాఫ్టుకు వెళుతున్నందున ఇవన్నీ రుణాల కోసం ప్రభుత్వాన్ని బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సిందిగా అడిగడంతో పాటు, తమ తమ ఉద్యోగుల జీతాలకు కోతపెట్టే అవకాశాలున్నాయి. కాగా, ప్రభత్వం ఎఫ్‌ఆర్‌బీఎమ్ చట్ట ప్రకారం ప్రతియేటా ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు జీడీపీలో 3 శాతం అప్పుతెచ్చుకునే వెసులుబాటున్నట్టుగానే ప్రభుత్వానికుండే మొత్తం రెవెన్యూలో ఈ బ్యాంకు గ్యారంటీలు 90 శాతానికి మించకూడదని అదే చట్టం చెబుతోంది. గడిచిన మార్చిలో ప్రవేశపెట్టిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం2020-21 బడ్జెట్ లో ప్రభుత్వం తనకుండే సాధారణ అప్పులతో పాటు ఈ బ్యాంకు గ్యారంటీల లెక్కలను వెల్లడించింది. మార్చి 1వ తేదీ వరకు వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వమిచ్చి రన్నింగ్‌లో ఉన్న బ్యాంకు గ్యారంటీల మొత్తం విలువ రూ.40వేల241కోట్లున్నట్టు ప్రభుత్వమే తెలిపింది. ఇందులో అత్యధికంగా కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ. 22వేల380కోట్లు , మిషన్ భగీరథ కార్పొరేషన్ రూ.12వేల10కోట్లు బ్యాంకుల నుంచి ప్రభుత్వ గ్యారంటీలతో రుణాలు తీసుకోగా మిగిలిన రూ.5840 కోట్లు రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు తీసుకున్నవి.

ఆదాయ ఆశల్లేని ఆర్టీసి, బిల్లులు వసూలవుతాయో లేదో తెలియని పవర్ కంపెనీలు..

మార్చి 22న జనతా కర్ఫ్యూరోజు నుంచి తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) బస్సలన్నీ డిపోలకే పరిమితమయ్యాయని తెలిసిందే. దీంతో రోజువారి వచ్చే ఆదాయం సైతం ఆర్టీసీకి లేకుండా పోయింది. ఈ ఏప్రిల్ 14వరకే లాక్ డౌన్ కొనసాగుతుందనుకుంటే ఆర్టీసీకి మొత్తం 22 రోజుల ఆదాయం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినట్టే. గతేడాదే సమ్మె వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిన ఆర్టీసీ ప్రయాణ చార్జీలు సైతం పెంచింది. సమ్మె ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే కరోనా లాక్‌డౌన్ వచ్చిపడింది. దీంతో ఆర్టీసీని మళ్లీ ప్రభుత్వమే ఆదుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వకపోయినా కార్మికుల జీతాలకు, ఇతర ఖర్చులకు, ఇప్పటికే ఉన్న అప్పులకు వడ్డీ కట్టడానికి మళ్లీ అప్పు తీసుకునేందుకుగాను బ్యాంకు గ్యారంటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మకుల పీఎఫ్, సీసీఎస్ డబ్బులను సైతం వాడుకున్న ఆ సంస్థ యాజమాన్యం అవి చెల్లించడానికి ఇప్పటికే ప్రభుత్వాన్ని రూ.600 కోట్లకు బ్యాంకు గ్యారంటీ అడగగా లాక్‌డౌన్‌కు ముందే ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ అప్పు మొత్తం పెరిగే అవకాశం ఉంది. లేదంటే సింగరేణి ఉద్యోగుల్లానే ఆర్టీసీ ఉద్యోగులకు సైతం వాయిదాల పద్ధతిలో మార్చి నెల జీతాలిచ్చే అవకాశం ఉంది.

ఇదే రీతిలో రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) లాక్ డౌన్‌తో మార్చి నెల బిల్లుల విషయంలో ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డాయి. పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీలకు చెల్లించే బకాయిల విషయంలో మారటోరియం విధించాలని కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(సీఈఆర్సీ)కి కేంద్ర పవర్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలిచ్చినప్పటికీ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్ఈఆర్సీ) ఈ విషయమై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే పుట్టెడు అప్పుల్లో ఉండడం, విద్యుత్ కొనుగోలు, సరఫరా ఖర్చు సంస్థకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉండి నష్టాల్లో ఉన్న ఈ పవర్ కార్పొరేషన్లకు సాధారణంగా గృహ, కమర్షియల్, ఇండస్ట్రియల్ కస్టమర్ల నుంచి వచ్చే ఆ కొద్ది ఆదాయాన్ని సైతం ఈ లాక్ డౌన్ వల్ల వసూలు చేసుకునే పరిస్థితిలో లేవు. ఈ పరిస్థితుల్లో నిర్వహణ ఖర్చుల కోసం అప్పులు తేవడానికిగాను ప్రభుత్వ గ్యారంటీలతో మళ్లీ బ్యాంకు తలుపుతట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మార్చి 22నే జనతా కర్ఫ్యూ ప్రారంభమవడం, తర్వాత లాక్ డౌన్ కొనసాగడంతో అంతకముందు ఫిబ్రవరి నెల విద్యుత్ బిల్లులనే మార్చిలో పలువురు కస్టమర్లు చెల్లించలేకపోయారు. ఇక మార్చి నెలలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి జీతాలొస్తాయన్న ఆశల్లేకపోవడంతో ఏప్రిల్‌లో పవర్ బిల్లులు వసూలయ్యే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.

ధాన్యం కొనడానికి ఇప్పటికే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు రూ.25వేల కోట్లు,

మార్క్ ఫెడ్ కు రూ.3500 కోట్లు..

రబీ సీజన్‌లో రాష్ట్రంలో పలు నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల కొత్త ఆయకట్టు సాగవడంతో విపరీతంగా పంట దిగుబడి రానుందని సీఎం కేసీఆర్ ఇటీవలే చెప్పారు. ఈ పంటనంతా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వమే కొంటుందని దీనికి కావాల్సిన నిధులు ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా రూ.25వేల కోట్లు ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌కు, రూ.3వేల 500 కోట్లు మక్కల కొనుగోలు‌కు మార్క్ ఫెడ్‌కు గ్యారంటీ ఇవ్వనున్నామని ఆయన ప్రకటించారు. కాగా, మార్క్ ఫెడ్‌కు గ్యారంటీ ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం, ధాన్యం కొనుగోలుకు త్వరలో ఉత్తర్వులిచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ధాన్యానికి సంబంధించిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వ కోటా నిధులు రాగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకు రుణాలు కొంత వరకు చెల్లించే అవకాశం ఉంటుంది.

లాక్‌డౌన్ ముగిస్తేనే బ్యాంకులకు చెల్లింపు..

లాక్‌డౌన్ ముగిసి ప్రభుత్వ ఖజానాకు, కార్పొరేషన్ల ఖజానాలకు నిధులొస్తేనే ప్రస్తుత అవసరాల కోసం ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకున్న రుణాలను కార్పొరేషన్లు తిరిగి చెల్లించే అవకాశం ఉంది. పూర్తిగా సొంత నిధులు కాకపోయినా ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఇచ్చే నిధులు సైతం రుణాల చెల్లింపునకు కార్పొరేషన్‌లు రుణాలు చెల్లింపునకు వాడుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం కరోనా లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వ ఖజానాకే నిధులు వచ్చే అవకాశాల్లేనందున ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లకు కావాల్సిన రుణాల కోసం బ్యాంకులకు భారీగా గ్యారంటీలిచ్చే అవకాశం ఉంది. దీంతో బడ్జెట్ బయట అప్పులుగా పరిగణించే ఈ బ్యాంకు గ్యారంటీల విలువ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరగనున్నట్టు తెలుస్తోంది.

Tags : lockdown, government corporations, telangana, financial situation, rtc, discoms

Next Story

Most Viewed