మురికివాడకు కరోనా.. మూడో దశ వ్యాప్తి?

by  |
మురికివాడకు కరోనా.. మూడో దశ వ్యాప్తి?
X

ముంబయి : కరోనావైరస్ సంపన్నులకు సోకే వైరస్ అనే వాదన కొంత ప్రచారంలో ఉన్నది. దేశాలు తిరిగేటోళ్లకు, సాఫ్ట్‌వేర్‌లకు, పెద్దపెద్ద సెలబ్రిటీలకు, నేతలకు మాత్రమే వస్తుందన్న అపోహలూ ఉన్నాయి. దేశంలో అంతరాలు లేవని కాదు. కానీ, ఈ అంతరాల మధ్య సంబంధాలు ఉంటాయన్న విషయాన్ని మరువరాదు. ముంబయిలోని ఓ మురికివాడకు కరోనావైరస్ చేరడమే ఇందుకు ఉదాహరణ. కిలోమీటరు పరిధిలోనే 23వేల మంది నివసించే సెంట్రల్ ముంబయి స్లమ్‌కు ఈ మహమ్మారి పాకింది. ఓ సంపన్న కుటుంబం ఇంటిలో పనిమనిషిగా చేరిన 68ఏళ్ల ముసలావిడకు మార్చి 18న ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. మురికివాడలో నమోదైన మొదటి కేసుగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనావైరస్ వ్యాప్తి రెండో దశ నుంచి సమూహాలకు వ్యాపించే మూడో దశకు చేరుకుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

ఈ నెల 7న ఓ ముంబయి వాసి(49) అమెరికా నుంచి సబర్బ్‌లోని సొంతింటికి తిరిగొచ్చాడు. పదిరోజుల తర్వాత అతనికి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని ఇంట్లో పనిచేస్తున్న వృద్ధురాలిని టెస్టు చేసేందుకు ఆమె నివసిస్తున్న సెంట్రల్ ముంబయిలోని స్లమ్‌కు అధికారులు వెళ్లారు. అంతే. ఆమె కొడుకు అధికారులపైకే ఒంటికాలిపై లేచాడు. ‘తాము పేదోళ్లం. ఈ మురికివాడలో బతుకుతాం. మాకు ఎక్కడి నుంచి వైరస్ అంటుకుంటుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. అలా కాదని, వైరస్ ఎవరికైనా సోకుతుందని, దానికి తారతమ్యాలేవీ ఉండవని చెప్పి సమాధానపరిస్తేగాని ఆ యువకుడు వివరాలు వెల్లడించలేదు. ఆ పదిరోజులు అతని తల్లి ఎక్కడెక్కడకెళ్లిందో? ఎవరెవరిని కలిసిందో కొంతమేరకైనా వివరించాడు. అగ్గిపెట్టెలాంటి చిన్ని ఇంటిలో ఆరుగురు సభ్యుల ఆ ముసలావిడ కుటుంబం నివసిస్తున్నది. ఆ ముసలావిడ మరో మూడు ఫ్లాట్‌లలో పనిచేస్తుందని తెలిపాడు. ప్రతిరోజు ఆమె పబ్లిక్ బాత్‌రూమ్‌లోనే స్నానం చేసేదని చెప్పాడు. అసలే అది పబ్లిక్ బాత్‌రూమ్ కావడంతో ఎవరెవరు ఆ బాత్‌రూమ్‌లను వినియోగించారో.. ఎంతమందికి సోకే అవకాశముందో? వారు ఎక్కడున్నారన్న వివరాలు సేకరించడం ఇప్పుడు కష్టంగా మారింది. అయితే, వాటిని డైలీ వాష్ చేస్తాం కాబట్టి వ్యాప్తికి అవకాశముండకపోవచ్చని ఓనర్లు తెలిపారు. ఇప్పటి వరకైతే.. ముసలావిడ పనిచేసిన రెండు ఫ్లాట్‌లలోని దంపతులను, ఆమె కుటుంబంలోని ఐదుగురుని హాస్పిటల్‌కు చేర్చి అబ్జర్వేషన్‌లో పెట్టారు. మూడో ఫ్లాట్ లాక్ వేసి ఉండగా.. ఓనర్ రాజస్తాన్‌లో ఉన్నట్టు గుర్తించారు.

స్లమ్ అంటేనే.. ఒకదానికి ఇంకొటి ఆనుకుని ఇళ్లు ఉంటాయి. ఒకరి ఇంట్లో నుంచి ఇంకొకరి ఇంట్లోకి అల్లరిచిల్లరగా తిరిగే పిల్లలు. ఆహారం పంచుకోవడాలు. అవసరాలూ పంచుకోవడం, తరుచూ ఒకరింటిలోకి మరొకరు వెళ్లుతుండటాలు స్లమ్‌లో చాలా కామన్‌గా ఉంటాయి. ఇంటికి మధ్యలో ఒక్క గోడ అడ్డుగా జీవిస్తుంటారు. ఆ పదిరోజుల్లో ముసలావిడ ఎంతమందినో కలిసి ఉండే అవకాశముంటుంది. ఇంకెంతమందికో వైరస్ సోకే ప్రమాదముంటుందని అధికారులు తలలు బాదుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కుటుంబ సభ్యుల మధ్య నుంచి సమూహాలకు వ్యాప్తి చెందే మూడో దశకు చేరిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అదీగాక, దేశవ్యాప్తంగా నగరాలపై ఆంక్షలు విధించడంతో చాలావరకు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఊళ్లకు తరలుతున్నారు. ఇందులో ఇప్పటికే వైరస్‌ సోకి లక్షణాలు బయటపడని వారూ ఉండొచ్చు. ఊళ్లల్లోనూ కలిసిమెలిసి, సామూహిక జీవనానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి వైరస్ ఒక అలగా ఊళ్లను కమ్మేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags: coronavirus, third stage, transmission, mumbai, slum, poor

Next Story