తగ్గనున్న కంపెనీల ఆదాయం!

by  |
తగ్గనున్న కంపెనీల ఆదాయం!
X

దిశ, వెబ్‌డెస్క్ : 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో దేశీయ సంస్థలకు నిరూత్సాహం తప్పేలా లేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్-19 మహమ్మారికి అగ్ర రాజ్యం అమెరికా సహా అన్ని దేశాలను నష్టాలు చుట్టుముట్టాయి. దీంతో గత నెల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా దేశీయంగా అనేక కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, సంస్థలు నిలిచిపోయాయి. దీంతో అన్నిరకాల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం స్పష్టం తెలుస్తోంది.

ముఖ్యంగా నిఫ్టీ ఇండెక్స్‌లోని కంపెనీల సగటు ఆదాయం 8 శాతం తగ్గిపోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా నికర లాభాలు 20 శాతానికి మించి దిగజారే అవకాశమున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మెటల్స్, ఆటో, సిమెంట్, మైనింగ్ రంగాలు అత్యధికంగా నష్టపోయే ప్రమాదముందని, ఇక కరోనా ప్రభావంతో బిజీగా మారిన ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఎఫ్ఎమ్‌సీజీ, ఫార్మా, ఐటీ రంగాలపై తక్కువ ప్రభావం కనిపిస్తుందని ఈ రంగాల్లోని వారు భావిస్తున్నారు. 2019 ఏడాదిలో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నిఫ్టీ కంపెనీల నికర లాభం సగటున 55 శాతం పెరిగాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ పనితీరు వల్ల ఈ స్థాయిలోలో నమోదైనట్టు తెలుస్తోంది. దీనికి అంతకుముందు త్రైమాసికంలో వృద్ధి తక్కువ నమోదు కావడం కూడా కారమై ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పరిణామాలు అనూహ్యంగా మారిపోవడంతో రానున్న త్రైమాసికాల్లో ఫలితాలు అనుకున్న దానికంటే తక్కువ నమోదవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదే ఏడాది పర్యావరణ నిబంధనలు మారనున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. దీనికితోడు లాక్‌డౌన్ వల్ల ఉత్పాదకత మరింత తగ్గింది. ఈ పరిణామాలతో ఆటో రంగం సగటు ఆదాయం 26 శాతం తగ్గింది. నికర లాభం సగం మేర తగ్గిపోనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు. లాక్డౌన్ ప్రభావంతో నిర్వహణ కూడా రెండు నుంచి మూడు శాతం బలహీనమవుతాయి. అలాగే, క్యాపిటల్ గూడ్స్ రంగానికి ఏడాది ముగిసే సమయంలో కొత్త ఆర్డర్లు రావడం ఆగిపోయాయి. ఈ రంగంలోని సంస్థల ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉంది. లాక్‌డౌన్ వంటి అమలు వల్ల ప్రధానంగా దెబ్బతినే రంగాల్లో ఎఫ్ఎమ్‌సీజీ ఒకటి. నిత్యావసరాలు, వ్యక్తిగత రక్షణ ఉప్తత్తులు ఎక్కువగా అమ్మే సంస్థలు కొంత నిలదొక్కుకోవచ్చు. ఈ రంగంలో అత్యధికంగా ఐటీసీ కంపెనీకి భారీ నష్టం తప్పదు. ఇప్పటికే ఈ సంస్థలోని సిగరెట్ల అమ్మకాలు 5 శాతం క్షీణించింది. లాక్‌డౌన్ వల్ల ఉత్పత్తి, సరఫరా నిలిచిపోవడంతో సిమెంట్ రంగానికి సుమారు 10 శాతం అమ్మకాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ రంగంలోని ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ, శ్రీ సిమెంట్, అంబుజా కంపెనీల ఆదాయం కనీసం 17 శాతం వరకూ తగ్గిపోయే ప్రమాదముంది.

ఈ ఏడాది ప్రారంభం నుంచే కొవిడ్-19 వ్యాపించడంతో దేశీయ కార్పొరేట్లపై ప్రభావం అధికంగా ఉంటుందని, దీనికి ముందు నిఫ్టీ-50 కంపెనీల ఆదాయంపై 20 శాతం అంచనాలను సవిరిస్తున్నామని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ గౌతమ్ తెలిపారు. సవరించిన అంచనాల కారణంగా కంపెనీల నికర లాభాల్లో వృద్ధి తక్కువగానే ఉండనున్నట్టు గౌతమ్ అభిప్రాయపడ్డారు. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆటోమొబైల్ రంగం ఏకంగా రూ. 17,310 కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు మైనింగ్, మెటల్ రంగాలు రూ. 16,800 కొట్లను, ఐటీ రూ. 2000 కొట్లు, సిమెంట్ రూ. 10,500 కోట్లు, బ్యాంకులు రూ. 1893 కోట్లు, పవర్ రూ. 4000 కోట్ల ఆదాయ నష్టాలను నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు.

లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలకు డిమాండ్ పెరిగింది. మార్చి త్రైమాసికంలో వినియోగ రంగాల్లో నిత్యావసరాలు నిలదొక్కుకుంటాయని గ్లోబల్ ఫిన్ సర్వీసెస్ హెడ్ సునీల్ వెల్లడించారు. అయితే, వినియోగ ఆధారిత రంగాలకు నష్టం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని రకాలుగా స్థంభించిపోయిన కారణంగా ఎగుమతుల రంగంలోని ఫార్మా, వ్యవసాయ కెమికల్స్ సంస్థల పనితీరు మెరుగ్గా ఉంటుందని సునీల్ అభిప్రాయపడ్డారు. డిమాండ్, అమ్మకాలు మందగించడం వల్ల కమొడిటీ ధరలు వ్యత్యాసం కనిపించకపోవచ్చని తెలుస్తోంది. పెట్టుబడిదారులు ఓపికతో రెండు మూడు త్రైమాసికల వరకూ వేచి ఉండాలని, టర్న్ అరౌండ్ జరగడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags: lockdown, lockdown effect, compenies, nifty, auto mobile

Next Story

Most Viewed