కోవిడ్ ఇమ్యూనిటీ కొద్దిరోజులే!

by  |
కోవిడ్ ఇమ్యూనిటీ కొద్దిరోజులే!
X

కొవిడ్ 19 సోకి చనిపోతున్నవారి కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ ఉండటం మంచి విషయమే. కానీ ఈ కోలుకున్నవారు.. ఆ రాకాసి వైరస్ ప్రభావాలను దగ్గరగా చూసినప్పటికీ, కరోనా నుంచి బయటపడి డిశ్చార్జి కాగానే విచ్చలవిడిగా బయటతిరిగేస్తున్నారు. ఏమన్నా అడిగితే.. మాకు కరోనా వచ్చింది పోయింది, ఇమ్యూనిటీ పెరిగింది, ఇక మాకు సోకదు అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. అలాంటి వారి కోసం లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు ఒక దుర్వార్తను బయటపెట్టారు. కొవిడ్ 19 ఇమ్యూనిటీ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని వారి పరిశోధనలో తేలింది. కరోనాను కట్టడి చేయడంలో దగ్గరుండి పనిచేసిన 96 మంది హెల్త్ వర్కర్లను వారు దగ్గరుండి పరీక్షలు చేసి ఈ వివరాలను వెల్లడించారు.

ఈ హెల్త్ కేర్ వర్కర్లు అందరికీ కరోనా ఉందని పీసీఆర్ పరీక్ష ద్వారా నిర్ధారించుకున్న తర్వాత వారి అనుమతి తీసుకుని తరచుగా పరీక్షలు చేసి, యాంటీ బాడీస్ లెక్కను రికార్డు చేసుకున్నారు. కరోనాతో పోరాడుతున్న సమయంలో వీరి రక్తంలో 60 శాతం యాంటీ బాడీస్ ఉండగా, మూడు వారాల తర్వాత చేసిన టెస్టుల్లో కేవలం 17 శాతం ఉన్నట్లు మాత్రమే తేలింది. ఇక తక్కువ లక్షణాలు కనిపించిన వారిలో మూడు వారాల తర్వాత యాంటీ బాడీస్ జాడ కూడా కనిపించలేదని పరిశోధకుల పరీక్షల్లో తేలింది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి చూస్తే ఇప్పట్లో కరోనా వైరస్‌కు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదని వారు వెల్లడించారు.

Next Story