64 రోజుల్లో లక్ష కేసులు నమోదు

by vinod kumar |
64 రోజుల్లో లక్ష కేసులు నమోదు
X

దిశ, వెబ్‌‌డెస్క్: మనదేశంలో కరోనా కేసులు లక్ష దాటినప్పటికీ.. ప్రపంచదేశాలతో పోల్చితే చాలా నెమ్మదిగా ఈ మార్క్‌ను చేరింది. భారత్‌లో జనవరి 29న తొలిసారి మూడు కరోనా కేసులు నమోదైనా.. మళ్లీ మార్చి 2 వరకు ఒక్క కేసూ నమోదవ్వలేదు. అనంతరం మార్చి 15వ తేదీనాటికి 100 కేసులు దాటాయి. ఇలా 100 నుంచి లక్ష కేసులు నమోదుకావడానికి మనదేశంలో 64 రోజులు పట్టింది. కానీ, ఇతర దేశాల్లో మాత్రం మనకంటే వేగంగా లక్ష కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో కరోనా విస్తరణ వేగం మందగించడంలో లాక్‌డౌన్ గణనీయమైన పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే, మార్చి 15వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ(14 రోజుల్లో) నాటికి కరోనా కేసులు వంద నుంచి వెయ్యికి చేరాయి. మరో 15 రోజుల్లో 10వేలకు చేరాయి. ఇదే తీరున కరోనా వ్యాప్తి జరిగితే.. ఏప్రిల్ చివరి నాటికే భారత్‌లో లక్ష కేసులు నమోదయ్యేవి. కానీ, ఈ కాలంలోనే అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గినట్టు తెలుస్తున్నది. ఏప్రిల్ చివరినాటికి 35వేల లోపే కేసులు ఉన్నాయి. అయితే, లాక్‌డౌన్ నిబంధనల సడలింపులతో ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల రోజుకు నాలుగు నుంచి ఐదు వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 7వ తేదీనాటికి సుమారు 52వేల కేసులుండగా.. 19వ తేదీనాటికి దాదాపు రెట్టింపు కేసులు నమోదవడం గమనార్హం. ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మనదేశంలో కరోనా కేసులు 100 నుంచి లక్షకు చేరడానికి 64 రోజుల వ్యవధి పట్టింది.

ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో ఈ మహమ్మారి ఇక్కడి కంటే వేగంగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు(15లక్షకు పైగా) నమోదైన అమెరికా.. 100 నుంచి లక్ష మార్క్‌ను కేవలం 25 రోజుల్లోనే దాటేసింది. స్పెయిన్(2.31 లక్షలు) 30 రోజుల్లో, జర్మనీ(1.7 లక్షలు) 35 రోజుల్లో, ఇటలీ(2.25 లక్షలు) 35 రోజుల్లోనే 100 నుంచి లక్ష కేసుల మార్క్‌ను అధిగమించింది. కాగా, 42 రోజుల్లో యూకే(2.47 లక్షలు), 39 రోజుల్లో ఫ్రాన్స్(1.80 లక్షలు) లక్ష కేసులు దాటాయి. ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో కరోనా పట్ల ప్రజలతో పాటు అధికారయంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విందులు-విలాసాల్లో మునగడంతో ఆ మహమ్మారి ఒక్కసారిగా విజృంభించింది. పైన పేర్కొన్న దేశాలు ఆర్థికంగా, అభివృద్ధిలోనూ ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాయి. కానీ, కరోనా వైరస్ కట్టడిలో మాత్రం చతికిలపడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ మహమ్మారితో అతలాకుతలమవుతున్నది.

Next Story

Most Viewed