సంక్రాంతికి కరోనా విరుగుడు.. తొలుత వారియర్లకే!

by  |
సంక్రాంతికి కరోనా విరుగుడు.. తొలుత వారియర్లకే!
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్​ వచ్చేస్తోంది. ఈనెల 13వ తేదీ నుంచి భారత్​లో రెండు టీకాలను పంపిణీ చేయనున్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ముందుగా వైద్య సిబ్బందికి, ఫ్రంట్​ లైన్​ వారియర్లకు వ్యాక్సిన్​లు వేస్తారు. దీనిపై కేంద్రం ఇప్పటికే డ్రై రన్​ నిర్వహించింది. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​.. ఈ రెండు టీకాలు పూర్తిగా స్వదేశంలోనే తయారయ్యాయి. ఉత్పత్తి కేంద్రాల నుంచి దేశంలోని నాలుగు ప్రధాన నగరాలకు విమానాల్లో తరలిస్తారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. టీకాలను నిల్వ చేసేందుకు దేశవ్యాప్తంగా 29 వేల కోల్డ్​ స్టోరేజీలు సిద్ధంగా ఉంచారు.

న్యూఢిల్లీ : టీకా పంపిణీ తేదీపై సస్పెన్స్ వీడింది. ఈ నెల 13లోపు టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తొలుత వైద్య సిబ్బంది, కరోనా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తామని, అందుకు వారు పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో టీకా లబ్ధిదారుల పేర్లు ఇప్పటికే నమోదయ్యాయని తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రై రన్ విజయవంతంగా ముగియడం, ఆ ప్రక్రియ అందించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వ్యాక్సినేషన్‌ను మొదలు పెడతామని వివరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. సీరం ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్​, భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలు మనదేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆదివారం (జనవరి 3న) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. జనవరిలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేసిన విషయం విదితమే. డ్రై రన్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతులు పొందిన తర్వాత పది రోజుల్లోనే టీకా పంపిణీకి తాము సంసిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం వెల్లడించారు. అయితే, తుది నిర్ణయం ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తొలి దఫాలో వైద్యులు, కరోనాపై ముందుండి పోరాడిన వారికి టీకా వేస్తామని తెలిపారు. వాళ్లు స్వయంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో బల్క్‌గా పేర్లు నమోదు జరిగాయని వివరించారు. ఈ అప్లికేషన్‌ లబ్ధిదారులను ఆధార్ నెంబర్‌ల ఆధారంగా నమోదు చేసుకుంటుందని, వారి సెషన్, టీకా సమయం, వేదిక, రెండో డోసు షెడ్యూల్ అన్ని వివరాలను తెలుపుతుందని చెప్పారు.

టీకా సరఫరా ఇలా..

ఉత్పత్తిదారుల నుంచి లబ్ధిదారులకు టీకా చేరే విధానాన్నికేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివరించారు. టీకా ఉత్పత్తిదారులు వ్యాక్సిన్‌లను ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపార్ట్‌మెంట్ డిపోలకు చేరవేస్తాయి. ముంబయి, చెన్నై, కోల్‌కతా, హర్యానాలోని కర్నాల్‌కు వాయుమార్గంలో ఈ టీకాలను పంపిస్తాయి. అక్కడి నుంచి రాష్ట్రాలకు చెందిన 37 టీకా స్టోరేజీలకు ఇవి చేరుతాయి. అటు నుంచి జిల్లా టీకా స్టోరేజీ కేంద్రాలకు, అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ చేరుతుంది. ప్రస్తుతం భారత రెగ్యులేటరీ అనుమతించిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల నిల్వలకు సరిపోయే 29 వేల శీతల కేంద్రాలు దేశవ్యాప్తంగా సిద్ధంగా ఉన్నాయి.

Next Story

Most Viewed