పార్లమెంటు ఉద్యోగికి కరోనా పాజిటివ్… రెండు అంతస్తులు ఖాళీ

by  |
పార్లమెంటు ఉద్యోగికి కరోనా పాజిటివ్… రెండు అంతస్తులు ఖాళీ
X

దిశ, న్యూస్ బ్యూరో: పార్లమెంటు సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన పనిచేస్తున్న అనెక్స్ భవనంలోని రెండు అంతస్తుల సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఇప్పటివరకు పార్లమెంటులో నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లయింది. రెండవ లాక్‌డౌన్ ముగిసిన అనంతరం ఈ నెల 3వ తేదీ నుంచి లోక్‌సభ, రాజ్యసభ సచివాలయ సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. యధావిధిగా గురువారం సైతం విధులకు హాజరైన డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు కరోనా పాజిటివ్ బాధితుడైనట్లు శుక్రవారం తెలిసింది. దీంతో అనెక్స్ భవనంలో ఆయన పనిచేస్తున్న ఉద్యోగులను క్వారంటైన్‌లోకి పంపడంతో పాటు ఆ రెండు అంతస్తుల్లో పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. ఆ రెండు అంతస్తుల్లోకి ఎవ్వరినీ వెళ్ళకుండా అధికారులు సీల్ వేశారు.

గతంలో లోక్‌సభ సచివాలయంలోని ట్రాన్స్‌లేషన్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. హౌజ్ కీపింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్న మరో ఉద్యోగికి, ఒక సెక్యూరిటీ విధుల్లో ఉన్న వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు కూడా వారు పనిచేస్తున్న విభాగాలన్నింటినీ మూసివేసి క్రిమి సంహారక మందులతో శుభ్రం చేశారు. త్వరలో పార్లమెంటు సమావేశాలను నిర్వహించడంపై లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సమావేశమై చర్చించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు ఒక ఉద్యోగి కరోనా పాజిటివ్ బారిన పడిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల రైల్ భవన్‌లోని ఒక ఉద్యోగికి, నీతి ఆయోగ్‌లోని మరో అధికారికి పాజిటివ్ రావడంతో రెండు రోజుల పాటు ఆ భవనాలను మూసివేశారు. పార్లమెంటుకు సమీపంలోనే ఉన్న కృషి భవన్, శాస్త్రి భవన్ ఉద్యోగులకు సైతం పాజిటివ్ రావడంతో ఇలాంటి చర్యలే తీసుకున్నారు. ఢిల్లీ నగరంలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పార్లమెంటు భవనంలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని శుభ్రం చేయడం, సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేయడం మొదలైంది.


Next Story

Most Viewed