24 గంటల్లో 48,916 పాజిటివ్‌లు

by  |
24 గంటల్లో 48,916 పాజిటివ్‌లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో ఒక్కరోజులో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు 40 వేలు దాటింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24గంటల్లో అత్యధికంగా 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేవలం మూడు రోజుల్లో లక్షకు పైగా కొత్త కేసులు నమోదైనట్లయింది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 13,36,861కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే 757మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 31,358కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా మరణాల్లో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారిలో 8,49,432 మంది కోలుకోగా ప్రస్తుతం 4,56,071 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో కొద్ది రోజులుగా కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పడుతోంది. ఒక్కరోజులో నమోదైన 1,142 పాజిటివ్‌లతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,29,531కు చేరింది. 29మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3806 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులో 9251 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,66,368కు వెళ్లింది. 24గంటల్లో వైరస్ బారినపడి 257 మంది చనిపోగా మొత్తం మరణాలు 13,389కి చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 6988 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల మార్కు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 2,06,737కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 89మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3409కు చేరింది. ఏపీలో 24గంటల్లో 7813 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 88,671కి చేరింది. ఒక్కరోజే 52 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 985 మంది మృత్యువాత పడ్డారు.

Next Story

Most Viewed