చిత్తూరులో కరోనా పేషంట్లు ఏమయ్యారు?

by  |
చిత్తూరులో కరోనా పేషంట్లు ఏమయ్యారు?
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఈ రోజు ఇంచుమించుగా 8 వేల పాజిటివ్ కేసులు నమోదై బెంబేలెత్తిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏపీలోని ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు మిస్సవడం కలకలం రేపుతోంది.

ఏపీలో కరోనా వైరస్ ప్రమాదకర స్థితిలో వ్యాప్తి చెందుతున్న జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఒకటి. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 5,939 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుపతి పట్టణంలో 50 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులోనూ 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్ని వార్డుల్లో 40 కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో తిరుపతిలో ఇప్పటి వరకు 1200కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇందులో గత పది రోజుల్లో 236 మంది కనిపించడం లేదని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. కరోనా టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు. స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్‌ తీసుకునే సమయంలో తెలివితేటలు ఉపయోగించిన కొందరు తప్పుడు ఫోన్ నంబర్, తప్పుడు అడ్రస్‌ని ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత పాజిటివ్‌గా తేలిందని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోంది. దీంతో నేరుగా వారు చెప్పిన అడ్రెస్‌కి వెళ్తే.. ఆ పేరుతో ఇక్కడెవరూ లేరన్న సమాధానం వస్తోంది. దీంతో అధికారులు తలలు పట్టు కుంటున్నారు.

రిపోర్టుల్లో పాజిటివ్‌గా తేలినప్పటికీ సాధారణ జనజీవనంతో తిరిగేస్తున్నారని, తద్వారానే చిత్తూరు జిల్లాలో రోజూ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కలెక్టర్ భరత్ నారాయణ విచారం వ్యక్తం చేయగా, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ కనీసం 20 పాజిటివ్ కేసుల విషయంలో ఇదే జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు పెరుగుతుండడంతో మార్చురీలు శవాలతో నిండిపోతున్నాయి. కరోనాకు కీలక ఆస్పత్రిగా చెప్పి స్విమ్స్ మార్చురీలో కేవలం 8 మృతదేహాలకు మాత్రమే ఫ్రీజర్లు ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య పెరుగుతుండడంతో కరోనా మృతుల శవాలను సెల్లార్‌లో ఉంచుతున్నారని, తద్వారా దుర్వాసన వస్తుందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.

Next Story