బల్దియాపై వైరస్ ​పడగ.. నగరంలో విజృంభణ

by  |
Corona positive
X

గ్రేటర్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం పదుల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం వందల్లోకి చేరుకున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. పెరుగుతున్న కరోనా కేసులతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, బల్దియాలోని మూడో అంతస్తులో ఉన్న స్పోర్ట్​సెక్షన్​లో కొందరికి వైరస్​సోకింది. దీంతో ఆ కార్యాలయాన్ని శానిటైజ్​చేసి తాత్కాలికంగా మూసివేశారు. రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్ తో బల్దియా అధికారులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం కొత్తగా 138 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఐదో అంతస్తులో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ విభాగంలోని సిబ్బందికి రెండు రోజులు సెలవులు ప్రకటించారు. తాజాగా, మూడో అంతస్తులోని స్పోర్ట్స్‌ సెక్షన్‌లోని మరి కొందరికి వైరస్ సోకింది. దీంతో ఆ సెక్షన్ కార్యాలయాన్ని కూడా శానిటైజ్ చేశారు. నగరంలో నమోదవుతున్న కేసుల సంఖ్యలోనూ రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలంటూ ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేసేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయం తేలాల్సి ఉంది. కరోనా నివారణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటివి అమలు చేయడంతో పాటు కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించిన అనుభవం ఉంది. ఈ సారి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందకపోవడంతో జనజీవనం సాధారణ స్థితిలోనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలో కొత్తగా కరోనా భారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం.

జీహెచ్ఎంసీలో కరోనా కేసులు

తేదీ కేసులు
24/03 138
23/03 111
22/03 103
21/03 91
20/03 81
19/03 75
18/03 47



Next Story

Most Viewed