కరోనా తగ్గడం కలేనా !

by  |
కరోనా తగ్గడం కలేనా !
X

• దేశం 60 వేల ముంగిట
• 20 వేలకు చేరువలో మహారాష్ట్ర
• కోయంబేడు కేసులు 1867

దిశ, న్యూస్‌బ్యూరో :
దేశంలో కరోనా కేసులు 60 వేలకు చేరువవుతుండగా.. మహారాష్ట్ర 20 వేల కేసులకు స్వల్ప దూరంలో ఉంది. అంటే దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో మూడింట ఒక వంతు మహారాష్ట్రలోనే నమోదవడం అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మరాఠా రాష్ట్రంలో మొత్తం కేసుల పరిస్థితి ఇలా ఉంటే.. ఒక్క రాజధాని ముంబై మహానగరంలోనే శనివారం కొత్తగా 748 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ నగరంలో మొత్తం కేసుల సంఖ్య 11967కు చేరింది. మహారాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే కరోనాతో 37 మంది మరణించగా, ఇప్పటివరకు మొత్తం 731 మంది చనిపోయారు. మరోపక్క రాష్ట్రంలో మొత్తం 3470 మంది వ్యాధి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇక దేశంలో మహారాష్ట్ర తర్వాత వేగంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా గుజరాత్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు 7797 కేసులు నమోదుకాగా, శనివారం ఒక్కరోజే 394 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 472 మంది కరోనాతో చనిపోగా 2091 మంది డిశ్చార్జయ్యారు. శనివారం వరకు 6542 కేసులు నమోదైన రాజధాని ఢిల్లీ.. దేశంలోనే కరోనా సోకిన వారి సంఖ్యాపరంగా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ శనివారం ఒక్కరోజే 224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఇప్పటివరకు 2020 మంది డిశ్చార్జవగా 68 మంది కరోనాతో మరణించారు. తమిళనాడులో శనివారం ఒక్కరోజే 526 కేసులు నమోదుకాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6535కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 44 మంది మరణించగా ఒక్కరోజే నలుగురు చనిపోయారు. శనివారం 219 మంది వ్యాధి నుంచి కోలుకోగా ఇప్పటివరకు తమిళనాడులో కరోనా సోకి డిశ్చార్జయిన వారి సంఖ్య 1824కు చేరింది. చెన్నైలో వ్యాధివ్యాప్తికి ముఖ్య కారణంగా ఉన్న కోయంబేడు కూరగాయల మార్కెట్‌లో ఇప్పటివరకు 1867 మందికి కరోనా సోకింది. చెన్నైలో శనివారం 5 ఏళ్ల బాలుడికి కరోనా సోకడం నగరంలో కలకలం రేపింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో శనివారం 43 మందికి పాజిటివ్ రాగా.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1930కి చేరింది. ఇక్కడ శనివారం సంభవించిన 3 మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య 44కు చేరింది. ఇక్కడ ప్రస్తుతం 999 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా పంజాబ్‌లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు 1762 మందికి వ్యాధి సోకగా వీరిలో 31 మంది మరణించారు. శనివారం ఈశాన్య రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేసే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆయా రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనాతో చనిపోతున్న వారి రేటు 3.3 శాతం ఉండగా రికవరీ రేటు 29.9 శాతంగా ఉందన్నారు. మొత్తం యాక్టివ్ కేసుల్లో ప్రస్తుతం 2.41 శాతం మంది ఐసీయూలో ఉండగా 1.88 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారని మంత్రి తెలిపారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెరిగిందని, రోజుకు 95 వేల మందికి టెస్టులు చేసే కెపాసిటీ ప్రస్తుతం దేశంలో ఉందన్నారు. 332 ప్రభుత్వ, 121 ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు చేసే సౌకర్యం ఉందని వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 15 లక్షల 25వేల 631 మందికి కరోనా పరీక్షలు జరిపామని హర్షవర్ధన్ తెలిపారు.

Next Story

Most Viewed