50వేలకు చేరువలో కరోనా కౌంట్

by  |
50వేలకు చేరువలో కరోనా కౌంట్
X

– ఒక్కరోజులో 2958 మందికి వ్యాధి
– ముంబైలో 10వేలు దాటిన కేసులు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి స్పీడు తగ్గడం లేదు. ఒక్క రోజులోనే వేలల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం సాధారణమైపోయింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ కేసుల వివరాలు వెల్లడించేసరికి 12 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 2958 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 49391కి చేరింది. కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం 1022 మంది వ్యాధి నుంచి కోలుకోగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 14183 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జయ్యారు. కరోనాతో కొత్తగా 126 మంది చనిపోగా మొత్తం మరణించినవారి సంఖ్య 1694కు చేరింది. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు మాత్రమే 24 గంటల బులెటిన్ విడుదల చేస్తామని, బుధవారం ఒక్కరోజు మాత్రం మంగళవారం సాయంత్రం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటలదాకా కేవలం 12 గంటల బులెటిన్‌నే రిలీజ్ చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 60 కేసులు నమోదుకాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1777కు చేరింది. ఇక్కడ ఒక్కరోజులోనే 40 మంది డిశ్చార్జవగా మొత్తం ఇప్పటివరకు 729 మంది డిశ్చార్జయ్యారు. బుధవారం ఇద్దరు చనిపోగా రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి మొత్తం సంఖ్య 36కు చేరింది. మహారాష్ట్రలో కొత్తగా 1233 పాజిటివ్ కేసులు నమోదవడంతో బుధవారం వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16758కి చేరింది. ఇక్కడ కొత్తగా 34 మంది చనిపోగా మొత్తం మరణించినవారి సంఖ్య 651కి చేరింది. రాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం ఒక్క రోజే 769 కేసులు రికార్డు కాగా, నగరంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 10527గా ఉన్నాయి. దీంతో దేశంలోని ఒకే నగరంలో పదివేల కేసులు నమోదైనట్లయింది. ఇక్కడ ఇప్పటివరకు 412 మంది చనిపోగా బుధవారం ఒక్కరోజే 25 మంది చనిపోవడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. తమిళనాడులో కొత్తగా 771 కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4829కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1516 మంది డిశ్చార్జవగా బుధవారం ఒక్కరోజే 31 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 35 మంది చనిపోగా బుధవారం ఇద్దరు మరణించారు.

Tags: corona, india, wednesday, cases

Next Story

Most Viewed