సైజుకొచ్చే.. చేతికి రాకపాయె..

by  |
సైజుకొచ్చే.. చేతికి రాకపాయె..
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ ఎఫెక్ట్ దాదాపు అన్నీ రంగాలను కుదిపేసింది. కూలీనాలీ పనులు చేసుకునే వారి దగ్గర్నుంచి.. బడా బిజినెస్ మ్యాన్స్ వరకు దీని బారిన పడ్డారు. అయితే పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులు ఈరోజు కాకపోతే రేపు.. ఈ యేడు కాకపోతే.. వచ్చే యేడు అమ్ముకోవచ్చు. భారీగా లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం రావు. కానీ, కొన్ని రంగాలది మాత్రం అలా కాదు. వారు ఉత్పత్తి చేసే సరుకులను ఎప్పటికప్పుడు అమ్ముకోకపోతే భారీ నష్టాల్నే చవిచూడాల్సి వస్తుంది. అలాంటి కోవకు చెందినవారే మత్స్యకారులు. కరోనా ఎఫెక్ట్ కారణంగా వారంతా ఇప్పుడు ఉపాధిని కోల్పోయారు. మత్స్య సంపద అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చేపల పెంపకం నీరుగారిపోయే పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో చేపల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో చెరువుల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులు ఆస్తకి చూపట్లేదు.

ఈ మూడు నెలలే కీలకం..

మత్సకారులకు చేపలు పట్టేందుకు మూడు నెలలే కీలకం. ఏడాదంతా ఒక ఎత్తు అయితే.. ఏప్రిల్, మే, జూన్ నెలలు చేపలు పట్టేందుకు మంచి సీజన్. కానీ, కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల రవాణా వ్యవస్థ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చేపలు పట్టినప్పటికీ.. ఎగుమతుల్లేక పారబోయాల్సి వస్తోన్నది. నల్లగొండ జిల్లా నుంచి ప్రధానంగా హైదరాబాద్‌కు చేపలను సరఫరా చేస్తారు. మరికొంతమంది ముంబై, ఢిల్లీ నగరాలకు మిర్యాలగూడ, నల్లగొండ ర్వెల్వే స్టేషన్ల మీదుగా ట్రాన్స్‌పోర్టు చేస్తుంటారు. మరోవైపు చెరువులు, జలాశయాల్లో నీరు అడుగంటి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఇప్పటికే చాలా చెరువుల్లో ఎండ వేడిమి తాళలేక చేపలు మృత్యువాత పడుతున్నాయి.

పడిపోయిన ధరలు..

కరోనా నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా చేపల ధరలు పతనమయ్యాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతుండడం వల్ల చేపలు కొనేవారు కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో అడపాదడపా కొంటున్నప్పటికీ ఊళ్లలో తిరిగి అమ్మే బేరగాళ్లు(చిల్లర వ్యాపారులు)ను కరోనా వైరస్ నేపథ్యంలో పోలీసులు తిరగనివ్వడం లేదు. ఒక్కరో ఇద్దరో వచ్చినా.. కిలో రూ.30కి మించి కొనట్లేదు. గతంలో రోజులో మత్స్యకారులకు రూ.300 నుంచి రూ.400 వస్తే ప్రస్తుతం రూ.100కు మించి రావడం లేదు.

ఇదీ పరిస్థితి..

నల్లగొండ జిల్లాలో 212 చెరువులు, 9 జలాశయాలు, 1952 గ్రామపంచాయతీ పరిధి చెరువులు ఉన్నాయి. ఆయా చెరువులు, జలాశయాలకు అనుబంధంగా 147 మత్స్య పారిశ్రామిక సంఘాలు, 22 మహిళా పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. వీరికి ఉపాధి కల్పించడంతో పాటు మత్స్య సంపదను అభివ‌ృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి సంబంధించి 471 చెరువుల్లో ఉచితంగా 4.57కోట్ల చేపపిల్లలను పోసింది. దీనికితోడు ఐదు జలాశయాల్లో 22.47 లక్షల రొయ్య పిల్లలను వదిలింది. నీలివిప్లవం కింద 2019-20 సంవత్సరానికి కొత్త చేపల చెరువుల నిర్మాణం కోసం 19 మంది లబ్ధిదారులకు రూ.70.07 లక్షలు మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం ఆయా చెరువులు, జలాశయాల పరిధిలోని చేపలన్నీ సైజుకు వచ్చాయి.

రవాణా లేక చేపలు పట్టట్లే : అంబటి రాము, ఎంపీటీసీ, పెద్దదేవులపల్లి

మా గ్రామ చెరువు చాలా పెద్దది. దీనిపై ఆధారపడి చాలామంది జీవనాధారం సాగిస్తున్నారు. నాతో పాటు ఇక్కడి మత్స్యకారులమందరం చేపలు పట్టేవాళ్లం. ఏటా ఈ సమయంలో చేపల అమ్మకాలు జాతరలెక్క సాగేవి. కానీ, లాక్‌డౌన్ వల్ల రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో చెరువులు బోసిపోతున్నాయి. చేపల ఎగుమతులు లేక మత్స్యకారులకు పని లేకుండా పోయింది. ఎలాగైనా వారికి ఆర్థిక సాయం చేసి ప్రభుత్వమే ఆదుకోవాలి.

కొనే దిక్కు లేదు : కొరేపల్లి రవి, మత్స్యకారుడు

సాధారణ రోజుల్లో పొద్దంతా కష్టపడితే రూ.300 దాకా వచ్చేవి. కానీ, ఇప్పుడు చేపలు కొనే దిక్కు లేదు. కిలోకు రూ.30కి మించి కొనట్లే. మేం చేపలు పట్టడంపైనే ఆధారపడి బతుకుతున్నాం. సంవత్సరం మొత్తంలో మాకు ఇదే మంచి సీజన్. కానీ, ఇప్పుడే కరోనా దెబ్బ వల్ల అమ్మకాలు లేవు. ఇగ సంవత్సరమంతా ఎట్ల బతకాల్నో ఏమో తెలవట్లేదు.

Tags: fish, markets, lose, farmers, nalgonda, fisherman

Next Story