ఎండకు ఎండి.. అక్కడే ఉండి!

by  |
ఎండకు ఎండి.. అక్కడే ఉండి!
X

దిశ, మహబూబ్ నగర్: సంవత్సరంలో కేవలం నెల నుంచి రెండు నెలలే వారికి పండుగ. సంవత్సరం మొత్తం కష్టపడితే ఈ రెండు నెలలు వారు తయారు చేసిన వస్తువులను విక్రయించుకుని తిరిగి పది నెలల పాటు జీవనం సాగించాల్సి ఉంటది. ఆ విధంగా వీరు కుల వృత్తులను నమ్ముకుని జీవిస్తుంటారు. వీరిలో ఒకరు కుమ్మరులు. వారికి వేసవి కాలంలోనే ఎక్కువగా గిరాకీ ఉంటది. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు సామాన్యుడు చల్లని నీటి కోసం కుండలను ఆశ్రయిస్తుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి నుంచే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో వారు కూడా తమకు కొంత అవకాశం కలిసివస్తదని ఆశపడ్డారు. కానీ, వారి ఆశలను అడియాశలుగా చేస్తూ కరోనా మహమ్మారి వారికి కన్నీళ్లే మిగిల్చింది. కరోనా కారణంగా ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతుండగా వచ్చిన వారు కూడా కుండలను కొనుగోళ్లు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అసలే రెక్కాడితే గానీ డొక్కాడని జీవులకు ప్రభుత్వ ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి కుండలను విక్రయించేందుకు పట్టణ కేంద్రాలకు తీసుకువచ్చారు. ప్రస్తుతం వందల సంఖ్యలో కుండలను రోడ్లపై ఉంచారు. ప్రస్తుత పరిస్థితిలో వాటిని తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, ఉన్నచోట వాటిని వదిలి వెళ్లలేక అనేక అవస్థలు పడుతున్నారు. వ్యాపారం చేసుకునే అవకాశం లేకపోయినా.. వాటికి కాపలగా ఎండకు ఎండుతూ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారం ఉంటేనే తమ పొట్ట నిండుతుందని, అలాంటిది ప్రస్తుతం వ్యాపారం లేకపోయినా అప్పు చేసి పొట్ట నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.

చూసేవారు కూడా లేరు..

కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వివిధ డిజైన్లలో కుండలను తయారు చేసినా ప్రస్తుతం వాటి వైపు చూసేవారు కూడా కరువయ్యారు. అసలు ఎప్పటి వరకు లాక్ డౌన్ కొనసాగుతది… అంతవరకు తమ పరిస్థితి ఏమిటని వారిలో వారే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద కరోనా ఎఫెక్ట్ ప్రత్యక్షంగా కొందరిని ఇబ్బంది పెడుతుంటే పరోక్షంగా ఇలా వందల సంఖ్యలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిపై కూడా పడిందనే చెప్పాలి.



Next Story

Most Viewed