సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రాల్లో వైరస్ విలయతాండవం

by  |
సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రాల్లో వైరస్ విలయతాండవం
X

కోల్‌కతా: కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్నా పశ్చిమ బెంగాల్‌లో ప్రచార కార్యక్రమాలు ఏమాత్రం తగ్గకుండా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు కేవలం పోలింగ్ కేంద్రాలకే పరిమితమవ్వగా, క్యాంపెయిన్‌లలో మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో కరోనా కేసులు ఊపందుకున్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగించుకున్న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం సహా ఇంకా కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్‌లో పక్షం రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి.

కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే ప్రచారం జరుగుతున్న అసోం, బెంగాల్‌లలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. రెండు వారాల్లో కరోనా కొత్త కేసులు అసోంలో 331 శాతం పెరగ్గా, పశ్చిమ బెంగాల్‌లో 378 శాతం పెరిగాయి. బెంగాల్‌లో నాలుగు విడతల పోలింగ్ ముగియగా, మరో నాలుగు విడతలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా ప్రవేశించినప్పటి నుంచి రికార్డ్ చేయని అత్యధిక కేసులను ఇప్పుడు నమోదు చేస్తున్నది. తాజాగా, బెంగాల్ కొత్త కేసులు 4398కు చేరాయి. బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ కొత్త కరోనా కేసులు ఆల్ టైం రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే రాజధాని నగరంలో 1109 కేసులు నమోదవడం అక్కడి పరిస్థితులకు అద్దంపడుతున్నాయి.

కుంభ మేళాలో భౌతిక దూరం అసాధ్యం: అధికారులు

ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాకు పదుల లక్షల సంఖ్యల్లో తరలివెళ్లారు. వెళ్తు్న్నారు. ఇక్కడ కరోనా నిబంధనలు దాదాపు అసాధ్యంగానే కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కుంభమేళ మరో హాట్‌స్పాట్‌గా మారనుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుంభమేళలో భౌతిక దూరాన్ని అమలు చేయడం అసాధ్యమని అధికారులూ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటించాలని తరుచూ చెబుతూనే ఉన్నామని ఇన్‌స్పెక్టర్ సంజయ్ గుంజాల్ వివరించారు. జనాలు పెద్దమొత్తంలో ఉండటంతో వారికి చలానాలు జారీ చేయడం సాధ్యం కాదని అన్నారు. అలాగే, ఘాట్‌లలో భౌతిక దూరాన్ని అమలు చేయడం అసాధ్యమని చెప్పారు. కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించే చర్యలకు ఉపక్రమిస్తే ఇక్కడ తొక్కిసలాట ఏర్పడే ముప్పు ఉన్నదని, కాబట్టి ముఖ్యంగా ఘాట్‌లలో భౌతికదూరాన్ని అమలు చేయడం కష్టంగా ఉన్నదని అన్నారు.

Next Story

Most Viewed