కార్గిల్ అమరుల కంటే కరోనా మరణాలే ఎక్కువ

by  |
కార్గిల్ అమరుల కంటే కరోనా మరణాలే ఎక్కువ
X

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరణాలపై రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ వేద ప్రకాశ్ మాలిక్ ఆందోళన వ్యక్తంచేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో అమరులైన జవాన్ల కంటే దేశంలో శనివారం నమోదైన కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన వేదకుమార్.. ‘మనదేశం యుద్ధరంగంలో ఉంది. కరోనా కారణంగా నిన్న (శనివారం) 1338 మంది మరణించారు. ఇది కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ యుద్ధం (కరోనా)పై దేశం దృష్టి సారించిందా..?’ అని ప్రశ్నించారు.

అంతేగాక కరోనా వీరవిహారం చేస్తున్న తరుణాన రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ర్యాలీలను నిర్వహించడంపై వేద ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో ఎన్నికల ర్యాలీలు, మతపరమైన ఊరేగింపులు, రైతుల ఆందోళనలు.. వంటివి నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ఇండియా మేలుకో..!’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 1999లో దాయాది దేశం పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో వేద ప్రకాశ్ భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కార్గిల్ యుద్ధ సమయంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు.

Next Story