అధికార-ప్రతిపక్షాల ‘సహకారం’..!

by  |
అధికార-ప్రతిపక్షాల ‘సహకారం’..!
X

నిర్మల్ నియోజకవర్గంలోని సహకార ఎన్నికల్లో అపవిత్ర పొత్తులతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పదవులు పంచుకున్నాయి. సహకార ఎన్నికల నేపథ్యంలో.. ప్రాదేశిక నియోజకవర్గాల డైరెక్టర్ల పదవులకు తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు సర్ధుబాటు రాజకీయాలకు దిగాయి. అందరూ, ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ… అధికార హోదా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడి నేతలు. పాలకపక్షం, ప్రతిపక్షం మాకెందుకు..? పదవి దక్కితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఇది ఇరు పార్టీలకు చెడ్డపేరు తెచ్చేలా ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్‌తో కలిసి సయోధ్యకు సై అంటున్నారు. కాగా, నిర్మల్ నియోజకవర్గానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణ్ చందా సొసైటీ ఎన్నికల్లో ఈ అపవిత్ర పొత్తుకు పొద్దు పొడిచింది. ఈ సహకార సంఘంలో మొత్తం 13 ప్రాదేశిక నియోజకవర్గాల ఉండగా అధికార పార్టీకి చైర్మన్ పదవి.. ప్రతిపక్ష పార్టీకి వైస్ చైర్మన్ పదవి దక్కేలా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ పొత్తులలో 8 ప్రాదేశిక డైరెక్టర్లలో టిఆర్ఎస్, 5 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇక సొసైటీ అధ్యక్ష ఎన్నిక విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టు కూడా చెబుతున్నారు. మరోవైపు మామడ మండలంలోనూ.. టీఆర్ఎస్-కాంగ్రెస్ నడుమ ఇలాంటి పొత్తులే నడిచాయి. ఏదేమైనా రాజకీయ నాయకులు తమ అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఇలాంటి అనైతిక పొత్తులకు దిగడం గమనార్హం.

Next Story

Most Viewed