TRS పార్టీకి నేనే బాస్.. విలేకరులు వెధవలు.. MLA కొడుకు వివాదాస్పద కామెంట్స్

by  |
TRS పార్టీకి నేనే బాస్.. విలేకరులు వెధవలు.. MLA కొడుకు వివాదాస్పద కామెంట్స్
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేశారు.. అయినా తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే కదా.. ఆమెకు థ్యాంక్స్ చెబితే తప్పేంటి.. సింగరేణి మండలానికి, స్థానిక టీఆర్ఎస్ పార్టీకి నేనే బాస్.. ఏవైనా వార్తలు రాసేముందు నన్ను సంప్రదించండి. పార్టీలోని అందరూ అన్నింట్లో వేలుపెడుతున్నారు.. భూకబ్జాలు చేస్తున్నారు.. కానిస్టేబుల్ పోస్టులకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు.. రెవెన్యూ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు.. మానాన్న ఇవేమైనా చేస్తున్నారా..? ఇవి ఎవరో అన్న మాటలు కాదు.. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడు జీవన్ లాల్ చేసిన వ్యాఖ్యలు.

అంతేకాదు విలేకరులను వెధవలంటూ సంభోదించారు. ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి అయి ఉండి రాజకీయాల గురించి మాట్లాడటం.. అంతేకాదు రాజకీయ నాయకులందరూ అవినీతి పరులంటూ అర్థం వచ్చే విధంగా పలు వ్యాఖ్యలు చేయడంతో పాటు తన తండ్రి మాత్రమే నీతిమంతుడంటూ చెప్పడంతో అక్కడున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో ఫంక్షన్‌కు హాజరైన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తనయుడు జీవన్ లాల్ విలేకరులతో సమావేశమై మాట్లాడారు. సింగరేణి మండలానికి, పార్టీకి తానే బాస్ అని చెప్పుకొచ్చారు. తనకు తన తండ్రి ఆ మండలాన్ని పూర్తిగా అప్పజెప్పి చూసుకోమన్నారంటూ మాట్లాడారు.

అంతేకాదు.. తన తండ్రి ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు తన అనుచరులను చితకబాదిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన విలేకరులను ‘వెధవలు’ అంటూ సంభోదించారు. తన తండ్రి గురించి ఏవైనా వార్తలు రాయాలంటే మొదట తనకు సమాచారం ఇవ్వాలని, ఆ తర్వాతే వార్తలు రాయాలంటూ హుకుం జారీ చేసినంత పనిచేశారు.

ఐఆర్ఎస్ రాజకీయాల గురించి మాట్లాడొచ్చా..

జీవన్ లాల్ ఐఆర్ఎస్.. ఓ ఉన్నతాధికారి. అలాంటిది రాజకీయాల గురించి మాట్లాడటం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు.. తన తండ్రికి సంబంధించి ఏవైనా విషయాలుంటే తనకు సమాచారం ఇవ్వాలని విలేకరులతో చెప్పారు. పార్టీ నాయకులు సైతం ఏవైనా తప్పులు చేస్తే చూసీచూడనట్లు వదిలేయాలంటూ విలేకరులను ఉద్దేశించి అన్నారు.

ఇక రాములు నాయక్ ఇటీవల చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలు గ్రామాల్లో ఆయన్ను తమ ఊరికి రావొద్దంటూ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులపై అసహనంతో దాడి కూడా చేశారు. ఇవన్నీ కాదు.. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అంటూ చెప్పి థ్యాంక్స్ చెప్పారు. వీటన్నింటినీ జనం ముందుంచిన విలేకరులను ఓ అత్యున్నత స్థాయి అధికారి వెధవలని మాట్లాడటంతో.. పాత్రికేయలోకం ఆయనపై మండిపడుతోంది.

తాము రాసే వార్తలకు, మండల టీఆర్ఎస్ పార్టీతో సదరు వ్యక్తికి సంబంధం ఏంటని? పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి వార్తలు రాయాలో విలేకరులకు సూచనలు ఇవ్వడం ఏంటంటూ అసహనానికి గురవుతున్నారు. ఎమ్మెల్యే తనయుడు అయితే మాత్రం.. ఓ ప్రభుత్వ అధికారి అయి ఉండి ఇలా రాజకీయ అధికారంతో మాట్లాడొచ్చా అంటూ నిలదీస్తున్నారు.

తన తండ్రి ఒక్కడే నీతిమంతుడా..?

జీవన్ లాల్ మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గంలో చాలా అవినీతి ఉండేదని, అన్నింట్లో వేలుపెడుతుండేవారని.. రెవెన్యూ విషయంలో కూడా అధికారం చెలాయించేవారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా..? అని విలేకరులను ఎదురు ప్రశ్నించారు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ‘ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నా.. నిరుద్యోగులకు డబ్బులు పంచండి.. ఏం భయం లేదంటూ’ రాములు నాయక్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

ఇది కూడా నీతేనా..? అంటూ పాత్రికేయులు మండిపడుతున్నారు. గెలిచి మూడేళ్లయినా ఆయన కన్నెత్తి చూడని గ్రామాలు చాలా ఉన్నాయని.. ఇటీవల పలు గ్రామాల్లో ఎమ్మెల్యేపై నిరసన కూడా వ్యక్తమైన విషయం తెలిసిందేనని.. ఇదేనా నీతిమంతమైన పాలన అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారి అయి ఉండి విలేకరులను వెధవలంటూ వ్యాఖ్యానించడం సరికాదంటున్నారు. ఇప్పటికే మండలంలో అనేక మంది ప్రజాప్రతినిధులు అటు తండ్రికి, ఇటు కొడుకుకి, సమాధానం చెప్పలేక అసంతృప్తిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగానే విలేకరుల సాక్షిగా ఎమ్మెల్యే తనయుడు జీవన్ లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు.

Next Story